Begin typing your search above and press return to search.

బాబు ఫైర్ః హోదా తేవ‌డం దొంగ‌లెక్క‌లంత ఈజీ కాదు

By:  Tupaki Desk   |   22 May 2016 2:31 PM IST
బాబు ఫైర్ః హోదా తేవ‌డం దొంగ‌లెక్క‌లంత ఈజీ కాదు
X
ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మ‌రోమారు ప్రత్యేకహోదాపై ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా గురించి ఆంధ్రులు పెద్ద ఆశ‌లే పెట్టుకున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు అందుకు భిన్నంగా స్పందిస్తూ స్పెష‌ల్ స్టేట‌స్‌ తోనే రాష్ట్రానికి అన్నీ రావని అన్నారు. ఇప్పటికే ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలు ఏం సాధించాయని బాబు ప్రశ్నించారు. హోదా ఉన్న మిజోరం - నాగలాండ్‌ వంటి రాష్ట్రాలు అబివృద్ధిలో చివరి స్థానంలో ఉన్నాయని చెప్పారు.

అయితే ప్ర‌త్యేక హోదా గురించి చంద్ర‌బాబు ఈ మాటలు చెబుతూనే ప్రత్యేక హోదాను సాధించే విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సందర్భంగా హోదాపై రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలనూ ఆయన ప్రస్తావించారు. ఈ అంశంపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతున్నాయని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. హోదా తేవడమంటే ఇంట్లో కూర్చొని దొంగ లెక్కలు రాసుకున్నంత సులభం కాదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. పేరు ఏద‌నే దానితో సంబంధం లేకుండా రాష్ట్రం అభివృధ్ధి చెందేంత వరకు చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. కాంగ్రెస్‌ చేసిన నిర్వాకం వల్లే ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌ కు ఇక ఎప్పటికీ అవతరణ దినోత్సవం ఉండదని అన్నారు. దానికి బదులుగా ప్రతిసంవత్సరం నవ నిర్మాణ దీక్షలే ఉంటాయని చెప్పారు. ఈ సంవత్సరం విజయవాడలో ఈ దీక్షను ప్రారంభించి - 8న రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ముగిస్తామని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వ తీరును చంద్ర‌బాబు త‌ప్పుప‌ట్టారు. రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ ప్రాజెక్టుకు అనుమతులు లేవని, దీనిపై రైతులు పోరాటం చేస్తున్నారని చంద్ర‌బాబు తెలిపారు. నీటి పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీని ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి చేయకుండా కర్నూలులో దీక్ష చేస్తే లాభం లేదని ప్రతిపక్షనేత జగన్‌ ను ఉద్ధేశించి అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం చేసిన విలీన మండలాల ప్రజల బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు చెప్పారు. త్వరలోనే ఆ మండలాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.