Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల మీద దాడులు జరిగితే.. అప్పుడు పెదవి విప్పలేదే?

By:  Tupaki Desk   |   11 Jun 2015 9:50 AM IST
ఆంధ్రోళ్ల మీద దాడులు జరిగితే.. అప్పుడు పెదవి విప్పలేదే?
X
కొన్ని సందర్భాలు చాలా చిత్రంగా ఉంటాయి. ప్రజలకు అవసరమైనప్పుడు వారి పక్షాన నిలబడి నిలదీయాల్సిన నేతలు సైతం మౌనంగా ఉండిపోవటం.. జనం బాధ మనకెందుకు? అనుకోవటం కనిపిస్తుంది. ప్రజల గురించి భుజాన వేసుకొని మాట్లాడితే తమకున్న రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్న భావన వ్యక్తం చేయటం కనిపిస్తుంది.

ఎవరిదాకానో ఎందుకు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారంలోకి వద్దాం. గత ఏడాదిగా లేనిది.. ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లో ఆంధ్రోళ్లకు జరుగుతున్న అన్యాయాల మీద ఏకరువు పెడుతున్నారు. వారికి రక్షణ లేదని వాదిస్తున్నారు. ఆంధ్రోళ్లను హైదరాబాద్‌లో వేధింపులకు గురి చేస్తున్నారని.. వారి ఆస్తుల మీద దాడులు చేస్తున్నారంటూ చాలానే వ్యాఖ్యలు చేస్తున్నారు.

చంద్రబాబు నోటి వెంట ఇలాంటి మాటలు అస్సలు రావు. దీంతో.. ఈ వ్యాఖ్యలు అసలు చంద్రబాబు అన్నవేనా? అన్న అనుమానంతో చూసినోళ్లు ఉన్నారు. చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడకపోవటానికి.. ఇలాంటి మాటలు మాట్లాడటం రాకపోవటం కాదు. అలా మాట్లాడితే తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్న ఉద్దేశ్యంతో కాస్తంత డిప్లమేటిక్‌గా తన ప్రజలకు అన్యాయాలు (ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తున్న పలు అంశాలు మాత్రమే) జరుగుతున్నాయన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు.

తన వాదనకు బలం చేకూర్చేందుకు ఆయన కొన్ని అంశాల్ని తెరపైకి తెచ్చారు. ఇక ఆ విషయాలు చూస్తే.. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి ఇళ్లను అయ్యప్ప సొసైటీ.. గురుకుల ట్రస్టు భూముల్లో కూల్చేస్తుంటే ఏమీ చేయకుండా ఉండిపోవటం సరికాదని అనుకున్నారని.. కార్మిక శాఖ నిధుల విషయంలోనూ.. తెలంగాణ పోలీసులు ఏపీ కార్మిక శాఖ అధికారిపై కేసు పెట్టటం.. న్యాక్‌ విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించటంతో పాటు.. నితమ్‌ సంస్థ విషయంలోనూ ఏపీ అధికారి చందనాఖాన్‌ను లోపలికే రానివ్వకుండా అడ్డుకోవటం లాంటి అంశాల్ని ఏకరవు పెడుతున్నారు. అంతేకాదు.. ఎంసెట్‌ నిర్వహణలోనూ పోలీసు రక్షణ ఇవ్వమని తెలంగాణ అధికారులు చెప్పటాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇన్ని ఉదంతాలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకోవటంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంతగా మాట్లాడేస్తున్న చంద్రబాబు.. ఈ ఘటనలు జరిగినప్పుడు ఒక్కసారి అయినా కనీసం ప్రస్తావించారా? అని బాబును ప్రశ్నిస్తున్న వారు చాలామందే ఉన్నారు.

అప్పుడు బాబు నోట వెంట ఈ సమస్యలు రాలేదంటే.. వీటివల్ల తనకేమీ నష్టం లేదు. ఒకవిధంగా వాటిని ప్రస్తావిస్తే తెలంగాణ అధికారపక్షం తమ పార్టీ మీద దాడి చేస్తుందని.. తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందన్న వాదనను తెరపైకి తీసుకొస్తారని.. అందుకే చూసీ చూడనట్లుగా వ్యవహరించారు.

కానీ.. ఓటుకు నోటు వ్యవహారంతో పీకల్లోతుల్లో ఇరుక్కున్న నేపథ్యంలో చంద్రబాబుకు హటాత్తుగా ఆంధ్రా వారికి హైదరాబాద్‌లో జరుగుతున్న దోపిడీ.. వారిపై సాగుతున్న దాడులు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. తాను బయటపడటానికి మించి.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు చిన్నవిగా మారటమే తాజా మార్పుకు కారణంగా చెప్పొచ్చు. అందుకే.. ఏడాదిగా గుర్తుకు రాని ఆంధ్రోళ్ల ఆస్తుల మీద దాడి అంశం ఇప్పుడు ఉన్నట్లుండి తెలుగుదేశం పార్టీకి గుర్తుకు వచ్చేసింది. పరిస్థితులు ఎలాంటి మాటలనైనా చెప్పిస్తాయనటానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదేమో.