Begin typing your search above and press return to search.

అమరావతిపై చంద్రబాబు బాంబు పేల్చారు

By:  Tupaki Desk   |   12 Jun 2016 1:11 PM IST
అమరావతిపై చంద్రబాబు బాంబు పేల్చారు
X
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని ప్రపంచ శ్రేణి నగరంగా... అత్యుత్తమ రాజధానిగా నిర్మించేందుకు ముందుకు ఉరికిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా బాంబు పేల్చారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయడం తన వల్ల కాదని చేతులెత్తేశారు. తాను పాలన రాజధాని(అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ )ని మాత్రం సాధ్యమైనంత త్వరగా నిర్మిస్తానని, మౌలిక వసతులు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆపై పరిశ్రమలు తరలి రావడం - ప్రజల నుంచి అందే సహకారం - ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధిపై ఆధారపడి పూర్తి నగరం నిర్మితం కావాల్సి ఉందే కానీ... అన్నీ తానే చేయాలంటే తన వల్ల కాదని తేల్చేశారు.

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న తరుణంలో చంద్రబాబు ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ఇలా అమరావతి నిర్మాణంపై వాస్తవ పరిస్థితులను వెల్లడించారు. తాను నిర్మించేది కేవలం అడ్మినిస్ట్రేటివ్ పార్టు మాత్రమేనని చెప్పారు. మిగతాది ప్రజల భాగస్వామ్యంతో డెవలప్ కావాల్సి ఉంటుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగువారు ఎన్నో ప్రయాసలు పడ్డారని.. 60 సంవత్సరాల పాటు హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్న తరువాత ఇప్పుడు హేతుబద్ధత లేకుండా కట్టుబట్టలతో తరిమేశారని విమర్శించారు. రాజధాని లేకుండా, బస్సులో నుంచి పాలన సాగిస్తూ, ప్రజలకు మేలు చేయాలని తాను చూశానని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ. 24 వేల కోట్ల రుణమాఫీని తాను చేశానని.. అయినా విపక్షాలు మాత్రం అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నాయని అన్నారు. 4 కోట్ల మందికి ప్రతి నెలా సరిపడా బియ్యం అందిస్తున్నామని... సంక్షేమ పథకాలు అమల్లో ముందున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీలో 24 గంటలు కోతల్లేని కరెంటు ఇస్తున్నామని చెప్పారు. గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేసి మొత్తం భారత దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పుకొచ్చారు.