Begin typing your search above and press return to search.

ఈ మాయ ఏమిటి చంద్రబాబు గారు

By:  Tupaki Desk   |   9 March 2018 11:00 PM IST
ఈ మాయ ఏమిటి చంద్రబాబు గారు
X
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి చంద్రబాబు తన కేంద్రమంత్రులను తప్పించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎలాగైతే నిధులు కేటాయిస్తున్నదో, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కు కూడా నిధులు ఇస్తున్నది తప్ప మిత్రపక్షంగా ఉండటం వలన తమను ప్రత్యేకంగా చూడడం లేదని ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఎన్డీయేలో ఉన్నా లేకపోయినా ఒకేరకంగా నిధులు రావడమే గనుక మంత్రి పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు గా హెచ్చరించారు. మరైతే ఇప్పుడు మరొక ట్విస్ట్ ను ఆయన తెలియజేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధుల వలన రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులు అయితే పనులు జరుగుతున్నాయి అవి ముందు ముందు ఇబ్బంది పడకుండా ఉండేలా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలని ఆయన పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. మిత్రపక్షం కావడం వలన ప్రత్యేకంగా వచ్చే నిధులు ఒక్క రూపాయి కూడా లేనప్పుడు, మిత్రపక్షంగా పోవడం వలన నిధులు ఆగిపోతాయని అనుమానం ఆయనకు ఎందుకు కలిగింది. ఇందులో ఏదో మతలబు ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

సూటిగా చెప్పాలంటే చంద్రబాబునాయుడు ఎన్డీయేలో భాగస్వామి కావడం వలన మాత్రమే కేంద్రం నుంచి వస్తుందని నిధులైనా కొన్ని ఉండాలి. లేకపోతే ముందు ముందు కూడా అన్ని ప్రాజెక్టుల పనులు యధా విధి గా సాగుతూ పోవాలి. అంతే తప్ప కేవలం మంత్రిపదవులు వదులుకున్న మాత్రాన నిధులు ఆగిపోవడం ఎలా జరుగుతుంది? అనేది ప్రజల సందేహం.

రాష్ట్ర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ప్రత్యేకంగా ఇవ్వలేదని పదేపదే అంటూ, మోడీ మీద గానీ, భాజపా సర్కారు మీద గానీ ఇప్పటి దాకా చల్లిన బురద సరిపోదని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అందుకే ప్రాజెక్టు ఆగిపోతాయని రకరకాలుగా బూచిని చూపి ప్రజలను భాజపా పట్ల ఒక అపరిమితమైన ద్వేషాన్ని పాదుకొల్పటానికి ఆయన నానా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉంది.

అయితే ప్రజలు మరీ అంత అమాయకంగా ఉంటారా ? బాబు మాటల్లోని మాయాజాలాన్ని గుర్తించడం ప్రజలకు చేత కాదని ఆయన అనుకుంటున్నారా? తనకు ఓట్లు వేసి ఒకసారి అధికారం అప్పగించి నంత మాత్రాన - ప్రజలు ఎప్పటికీ వెర్రి వెంగళాయి లాగే ఉంటారని, చంద్రబాబు తలపోస్తున్నారా? అని ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.