Begin typing your search above and press return to search.

హోదాపై బాబు కొత్త మాట విన్నారా?

By:  Tupaki Desk   |   27 March 2018 3:58 PM IST
హోదాపై బాబు కొత్త మాట విన్నారా?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ ఆది నుంచి వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రికి ఇప్పుడు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ... మొన్న‌టిదాకా న‌రేంద్ర మోదీ కేబినెట్ లోనూ భాగ‌స్వామిగానే ఉంది. అయితే రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా - ప్ర‌త్యేక రైల్వే జోన్‌ - ఉక్కు ఫ్యాక్టరీ త‌దిత‌రాల‌ను ఇస్తామ‌ని కేంద్రం నాడు ప్ర‌క‌టించింది. అయితే ఇప్పటిదాకా సింగిల్ హామీ కూడా నెర‌వేర‌లేదు. ఈ క్ర‌మంలో మొన్న‌టి కేంద్ర బడ్జెట్ లో క‌నీసం ఏపీ ప్ర‌స్తావ‌న కూడా లేక‌పోవ‌డం, ప్ర‌త్యేక హోదా కోసం విప‌క్ష వైసీపీ మ‌రింత దూకుడు పెంచిన నేప‌థ్యంలో టీడీపీ త‌న వ్యూహాన్ని మార్చుకోక త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా పోరులో దిగేసిన టీడీపీ... తొలుత త‌న ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌తో మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించింది. ఆ త‌ర్వాత ఏకంగా ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నిర‌స‌న‌ల‌తో ప‌ని కాద‌ని భావించిన వైసీపీ మోదీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెడితే... టీడీపీ కూడా అదే బాట ప‌ట్టక త‌ప్ప‌లేదు. మొత్తంగా ప్ర‌త్యేక హోదాపై మొన్న‌టిదాకా వినిపించిన మాట‌కు పూర్తి భిన్న‌మైన మార్గంలో టీడీపీ ప‌య‌నిస్తోంద‌న్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. అయితే ఈ త‌ర‌హా వైఖ‌రిని పూర్తిగా మ‌రిపించేందుకు చంద్ర‌బాబు అండ్ కో బాగానే శ్ర‌మిస్తున్న‌ట్లుగానూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. త‌న అనుకూల మీడియా ద్వారా... బాకాలు ఊదుతున్న బాబు... అస‌లు ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం మొద‌లుపెట్టిందే తానేన‌ని చెప్పుకొచ్చిన వైనంపైనా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేగాయి. తాజాగా చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాకు సంబందించి మ‌రో కొత్త మాట చెప్పారు. ఈ మాట వింటే నిజంగానే చంద్ర‌బాబు... యూట‌ర్న్ తీసుకున్నాన‌ని త‌న‌కు తానే ఒప్పుకున్న‌ట్లుగా అర్ధం వ‌స్తోంది. ప్ర‌త్యేక హోదా కోసం తాను మొద‌టి నుంచి పోరాడ‌లేద‌ని, ఇప్పుడిప్పుడే ఆ పోరాటాన్ని మొద‌లుపెట్టాన‌ని కూడా చంద్ర‌బాబు ప‌రోక్షంగానే చెప్పిన‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌ట‌న ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయినా చంద్ర‌బాబు ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... ఒకవేళ‌ తొలిరోజు నుంచే ప్ర‌త్యేక హోదా కోసం పోరాడి ఉంటే... తాను కాస్త ఓపికగా ఉంటే బాగుండేదని విమర్శించేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్య‌తోనే ప్ర‌త్యేక హోదా కోసం తాను ఇప్పుడిప్పుడే పోరాటం మొద‌లుపెట్టిన‌ట్టుగా చంద్ర‌బాబు త‌న‌కు తానుగా ఒప్పేసుకున్న‌ట్లుగా చెప్పాలి. ఇక అంత‌టితో ఆగ‌ని చంద్ర‌బాబు తొలి రోజు నుంచే తాను పోరాటం మొదలుపెట్టి ఉంటే రాష్ట్రానికి భారీ నష్టం జ‌రిగి ఉండేద‌ని కూడా చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల‌య్యాక అడిగితేనే కేంద్ర స‌ర్కారు ఇంత నిర్ల‌క్ష్యంగా వెళుతోంద‌ని, తొలిరోజు నుంచి దూకుడుగా వెళ్లి ఉంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జ‌రిగేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు అన్యాయం చేశార‌ని అనేవారని - మొద‌టి నుంచి ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలో అంత జాగ్ర‌త్త‌గా ఉన్నామ‌ని చంద్ర‌బాబు సూత్రీక‌రించారు.