Begin typing your search above and press return to search.

కేసీఆర్ బాటను చంద్రబాబు అనుసరించలేరా?

By:  Tupaki Desk   |   11 Nov 2017 11:30 PM GMT
కేసీఆర్ బాటను చంద్రబాబు అనుసరించలేరా?
X
విద్యార్థులను బలితీసుకుంటున్న సంస్థల నిర్వహణతీరుపట్ల ఇరు ప్రభుత్వాల వ్యవహారశైలిలోనూ పొంతన లేకుండాఉంది. ఒకవైపు విద్యాసంస్థలు పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటూ ఉంటే.. తెలంగాణ ప్రభుత్వంలో నియంత్రణ గురించి అంతో ఇంతో కదలిక కనిపిస్తోంది గానీ.. ఏపీ సర్కారు జడత్వం నిండినట్లుగా ఏమీ పట్టించుకోకుండా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి.

ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్థుల చావులపై తెలంగాణలో స్పందించిన ప్రభుత్వం వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. మేధావులతో కమిటీ వేసి పరిస్థితులపై అధ్యయనం చేయించింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో 194 విద్యాసంస్థలు ప్రమాణాలు పాటించడంలేదని నివేదికను రూపొందించిన కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రమాణాలు లేకుండా... విద్యాబోధనపేరుతో విద్యార్థులను బలిగొనడమేంటని ఆలస్యంగా స్పందించిన తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది. విద్యాసంవత్సరం మధ్యలో చర్యలు తీసుకుని గుర్తింపు రద్ధుచేస్తే నష్టపోయేది విద్యార్థులేనని వెనుకడుగు వేసింది. మేధావుల కమిటీ విద్యాసంస్థల సందర్శనతో ఆయా సంస్థల నిర్వాహకుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇదే తరహాలో తరచూ తనిఖీలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమైంది.

రాజకీయ నాయకుల అండదండలతో అత్యధికులు కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వాహకులే ఉండటం గమనించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారు ఇరుప్రాంతాల్లో విద్యాసంస్థలను విస్తరించి కోట్లు గడిస్తూ నిబంధనలకు ఖాతరు చేయడంలేదు. పొరుగు రాష్ట్రంలో విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించేందుకు కసరత్తు చేస్తుంటే... కార్పొరేట్ విద్యకు బీజంవేసిన ఆంధ్రప్రదేశ్ లో సర్కారు కిమ్మనలేదు. విద్యార్థులకు చావులకు విద్యాసంస్థల యాజమాన్యాలేనని కారణమని తెలిసినా తెలియనట్లు ప్రభుత్వం నటిస్తోందన్న విమర్శలు బాహాటంగా ఉన్నాయి. ప్రమాణాలను పాటించకుండా... చదువుల మోతతో పిల్లలను ఒత్తిడికి గురిచేస్తున్న విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణకు కూడా సర్కారు సాహసం చేయడంలేదు. ప్రభుత్వాల్లో కార్పొరేట్ విద్యాసంస్థల దిగ్గజాల జోక్యంతోనే వ్యవస్థ భ్రష్టుపట్టిందనే విమర్శలు విన్పిస్తున్నాయి.

తెలంగాణ తరహాలో విద్యాసంస్థలను తనిఖీలు నిర్వహించి సమూల ప్రక్షాళనకు చొరవతీసుకుంటేగానీ... ప్రయోజనం కానరాదని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. మేధావుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నవాటికే నిర్వహణ గుర్తింపునిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థలను స్వయంగా సందర్శించి వసతులు - ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని గుర్తింపు ఇవ్వడానికి చొరవతీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటు బ్యాంకు సంక్షేపథకాల విషయంలో టీ సర్కారును కాపీ కొట్టడానికి ఎన్నడూ వెనుకాడని చంద్రబాబు ప్రభుత్వం.. విద్యార్థుల కోసం కూడా వారి బాటను అనుసరిస్తే బాగుంటుందని పలువురు అభ్యర్థిస్తున్నారు.