Begin typing your search above and press return to search.

బాబుకు త‌ల‌నొప్పిగా మారిన బెజ‌వాడ కోల్డ్ వార్!

By:  Tupaki Desk   |   8 July 2018 4:09 PM GMT
బాబుకు త‌ల‌నొప్పిగా మారిన బెజ‌వాడ కోల్డ్ వార్!
X
ఒక‌ప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. ఇప్పుడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా మారింది. పార్టీ కంటే నేత‌ల ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీట వేసుకోవ‌టంతో ఎవ‌రికి వారుగా పావులు క‌ద‌ప‌టంతో టీడీపీలో కోల్డ్ వార్ అంత‌కంత‌కూ ముదురుతోంది.

పార్టీ ప్ర‌యోజ‌నాల పేరుతో ఇత‌ర ప‌రా్టీల నుంచి వ‌స్తున్న నేత‌ల కార‌ణంగా పార్టీలో అధిప‌త్య పోరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఎవ‌రికి వారు త‌మ బ‌లాన్ని పెంచుకోవ‌టం.. స‌రిహ‌ద్దుల్ని మ‌రిచి మ‌రీ పావులు క‌దుపుతున్నారు. దీంతో.. నేత‌ల మ‌ధ్య విభేదాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌ కు.. విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కు.. తెలుగు యువ‌త నేత దేవినేని అవినాష్ చెక్ పెడుతున్నారు. త‌న తండ్రి దేవినేని నెహ్రు వ‌ర్గం అండ‌దండ‌లు ఉండ‌టం.. వాటిని ఉప‌యోగించుకొని బెజ‌వాడ‌లో త‌న బ‌లాన్ని పెంచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో అవినాష్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీనికి తోడు కీల‌క నేత ఒక‌రు అవినాష్ కు అభ‌య‌హ‌స్తం ఇవ్వ‌టంతో ఆయ‌న చెల‌రేగిపోతూ.. త‌న బలాన్ని అంత‌కంత‌కూ పెంచుకోవ‌టం గ‌మ‌నార్హం.

త‌న తండ్రి వ‌ర్గంలో కీల‌కంగా ఉన్న నేత‌ల‌కు పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ కు పొసిగేది కాదు. త‌న బ‌లాన్ని పెంచుకోవ‌టం కోసం పెనుమ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తున్నారు. దీంతో బోడే వ్య‌తిరేక వ‌ర్గానికి దేవినేని అవినాష్ ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఇదిలా ఉంటే.. బోడే ప్ర‌సాద్ వైఖ‌రి సైతం దేవినేనికి క‌లిసి వ‌చ్చేలా మారింది.

దేవినేని నెహ్రు వ‌ర్థంతి కార్య‌క్ర‌మానికి బోడేను ఆహ్వానించినా ఆయ‌న హాజ‌రు కాలేదు. దేవినేని అవినాష్ వెళ్లిపోయిన త‌ర్వాత అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోవ‌టం అంద‌రి నోట్లో ఆయ‌న నానారు. ఇదిలా ఉంటే త‌న తండ్రి వ‌ర్థంతి కార్య‌క్ర‌మాల్ని పుర‌స్క‌రించుకొని కంకిపాడు.. పెన‌మ‌లూరు ప్రాంతాల్లో త‌న బ‌లాన్ని పెంచుకునే దిశ‌గా అవినాష్ ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌న బ‌లాన్ని పెంచుకొని అవ‌స‌ర‌మైతే పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు సైతం అవినాష్ రెఢీ అంటున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాత్ర‌మే కాదు.. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం మీదా అవినాష్ దృష్టి సారించారు. ఒక‌రికొక‌రు చెక్ పెట్టేందుకు పోటాపోటీగా ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌ద్దె వెంట ఉన్న వారిపై అవినాష్ ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తే.. ఆయ‌న వ‌ర్గాన్ని గ‌ద్దె పూర్తిగా ప‌క్కన పెడుతున్నారు. గ‌ద్దెను వ్య‌తిరేకించే వ‌ర్గంతో అవినాష్ వ‌ర్గీయులు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

గ‌ద్దె నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ఇప్పుడు చ‌ర్చ నిర్వ‌హిస్తున్నారు. దీంతో గ‌ద్దె గుర్రుగా ఉన్నారు. ఇలా నేత‌ల మ‌ధ్య న‌డుస్తున్న పోరుపై మంత్రి లోకేశ్ కు ఫిర్యాదు అందింది. అయితే.. స‌మ‌స్య ప‌రిష్కారం కాకపోవ‌టంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. పెన‌మ‌లూరు.. విజ‌య‌వాడ తూర్పులో ఏ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు అవినాష్ సిద్ధ‌మ‌వుతున్నారు. మొత్తంగా అవినాష్ పుణ్య‌మా అని బెజ‌వాడ రాజ‌కీయం హాట్ హాట్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు