Begin typing your search above and press return to search.

బాబు : పరనిందలే.. ఒక్క కొత్త సంగతి లేదు!

By:  Tupaki Desk   |   12 March 2018 4:29 PM IST
బాబు : పరనిందలే.. ఒక్క కొత్త సంగతి లేదు!
X
చంద్రబాబునాయుడు అసెంబ్లీ వేదికగా మళ్లీ ఓసారి కేంద్రమీద కత్తి దూశారు. స్థూలంగా చెప్పాలంటే.. గత నెలన్నర రోజులుగా చెబుతున్న సంగతులనే మళ్లీ జాబితా కట్టి అసెంబ్లీ సభ్యులకు వినిపించారు. పైగా ఇది ప్రతిపక్షం అంటూ లేని విచిత్రమైన అసెంబ్లీ. ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుంది. అడిగే వాళ్లుండరు? ఈవిషయాలను ఇదే వేదికగా ఎన్నిసార్లు చెబుతారంటూ అడిగే వారు లేరు. కాబట్టి చంద్రబాబు యథేచ్ఛగా రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ భారత్ లో భాగం కాదా? అంటూ ఓ మాట యాడ్ చేయడం తప్ప.. నిధులు విడుదలలు.. ఇవన్నీ.. రోజూ చెప్పే సంగతులే ఏకరవు పెట్టారు.

కొన్న కీలక అంశాల విషయంలో అసలు లోపం ఆయన మాటల గారడీలోనే ఉన్నదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి నిర్మాణాలకు సంబంధించి డీపీఆర్ లు లేకుండా.. నిదులు ఎలా విడుదల చేస్తాం అంటూ కేంద్రం ప్రశ్నిస్తోంటే.. మేం యూసీలు సమర్పించాం.. వాటిని నీతి ఆయోగ్ ధృవీకరించింది.. అని చంద్రబాబు ప్రకటించారు. ఇలాంటి యుటిలిటీ సర్టిఫికెట్లు పోలవరానికి సంబంధించి కూడా పంపాం అంటున్నారు. అయితే నీతి ఆయోగ్ ‘ధ్రువీకరించడం’ అనే మాట దగ్గర చిన్న మతలబు ఉంది. అవి అందినట్లుగా వారు ధ్రువీకరించారా.. అందులో లోపాలు లేవని, ఖర్చులన్నీ చాలా పద్ధతిగా నిజాయితీగా జరిగాయని వారు ధ్రువీకరించారా? అనేది సందేహం.

రాజధాని నిర్మాణాలకు నిధులు కావాలంటే డీపీఆర్ లు పంపండి అని కేంద్రం అంటోంటే.. ఆ మాటను కన్వీనియెంట్ గా పక్కన పెట్టేసి.. యూసీలు అంటూ ఆయన మాట్లాడుతున్నారు.

ఇలాంటి సంక్లిష్టత నేపథ్యంలో ప్రజల్లో ఓ మాట వినిపిస్తోంది.ఈ గొడవంతా ఎందుకు చంద్రబాబుగారూ.. అటు పోలవరం విషయంలో గానీ, ఇటు అమరావతి విషయంలో గానీ.. వచ్చిన నిధులు పెట్టిన ఖర్చులు సమస్తం మీరే శ్వేతపత్రం విడుదల చేయండి.. దాంతో అందరి బండారం బయటపడిపోతుంది కదా.. కేంద్రం మోసం చేస్తుంటే గనుక.. ఆ సంగతి తేలిపోతుంది కదా..? అని ప్రజలు నిలదీస్తున్నారు. మరి అందుకు చంద్రబాబునాయుడు సిద్ధమేనా? శ్వేతపత్రం అంటేనే గుబులు పడే చంద్రబాబు.. అదే జరిగితే.. బయటపడేది కేంద్రం బండారం కాదు, తన బండారమే అని జంకుతారా? అనికూడా పలువురు సందేహిస్తున్నారు.