Begin typing your search above and press return to search.

సమైక్య పాలకుల్ని ఇంకా నిందిస్తే పుట్టగతులుండవ్!

By:  Tupaki Desk   |   28 Feb 2018 5:00 AM IST
సమైక్య పాలకుల్ని ఇంకా నిందిస్తే పుట్టగతులుండవ్!
X
తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ కు గాని - ఆయన కేబినెట్ లోని నాయకులకు గానీ.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సులువైన మాట ఒకటుంది. ఏ రంగంలో ఎలాంటి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికైనా వారు చటుక్కున ఆ మాట వాడేస్తారు. ఎవరు తమను నిందించే ప్రయత్నం చేసినా - తమ లోపాలను ఎత్తిచూపించే ప్రయత్నం చేసినా.. వెంటనే ఆ మాటను కవచం లాగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతకూ అదేం మాటో తెలుసా? ‘‘సమైక్యరాష్ట్రంగా ఉన్నప్పుడు పాలకులు మీకు తీరని అన్యాయం చేశారు. అందుకే మనం పోరాడి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం.. మీకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం’’ అనేది ఆ మాట!

తెరాస అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడచిపోతున్నాయి. ఇంతకాలం గడుస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి లవలేశం కూడా కనిపించని ప్రతిచోటా ఇదే పాట పాడి నెగ్గుకు రావాలని కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తున్నది. ఇందుకు తార్కాణాలు మనకు అనేకం కనిపిస్తాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. అన్ని వనరులు పుష్కలంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు సమైక్య పాలకులు తీరని ద్రోహం చేశారని - అందుకే వెనుకబాటుతనం ఉన్నదని.. ఆయన సెలవిచ్చారు.

ప్రజలకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. సమైక్య పాలకులు ద్రోహం చేశారు మంచిదే.. నాలుగేళ్ల కాలంలో మీరు ఎంత ప్రగతిని చూపించారు. ఆ సంగతి చెప్పండి? సమైక్య పాలకులు హైదరాబాదును బాగానే అభివృద్ధి చేశారు కదా..? మీరు కూడా అక్కడే వేల వేల కోట్లు తగలేస్తున్నారు ఎందుకు? సమైక్య పాలకులు.. ఏ ఆదిలాబాద్ వంటి జిల్లాలనైతే ఎక్కువ అన్యాయానికి గురిచేశారో.. తమరు అలాంటి జిల్లాల మీద దృష్టి పెట్టి.. వాటిని మీద ఎక్కువ నిధులు వెచ్చించి తతిమ్మా ప్రాంతాలతో సమానమైన స్థాయికి వచ్చేదాకా దత్తత తీసుకున్నట్లుగా ప్రవర్తింవచ్చు కదా.. నాలుగేళ్ల పరిపాలనకాలం ప్రజలకు మంచి చేయడానికి సరిపోదా? అని ప్రజలు అడుగుతున్నారు.

ఎడ్మినిస్ట్రేషన్ లో కొన్ని పనులు ముందు వెనుక జరగడం నిజమే కావొచ్చు. ఆదిలాబాద్ మీద సీఎం కేసీఆర్ తానుగా దృష్టిపెట్టేసరికి నాలుగేళ్లు గడచిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన... ప్రతి పాపాన్ని సమైక్య పాలకుల మీద వేసేయడం ఎంతవరకు సబబు? ప్రజలు మరీ అంత వెర్రవాళ్లని అమాయకులని కేసీఆర్ అనుకుంటున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..