Begin typing your search above and press return to search.

బాబు చేసిన జాప్యం జాతికి ద్రోహం కాదా

By:  Tupaki Desk   |   20 Feb 2018 10:19 AM IST
బాబు చేసిన జాప్యం జాతికి ద్రోహం కాదా
X
విభజన హామీలను సాధించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయబోతున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. బహుశా ఒకటి రెండురోజుల్లోనే అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు మాత్రమేనా? అన్ని పార్టీలా? అనే విషయాన్ని మంగళవారం నిర్ణయించి.. ఆమేరకు ఆహ్వానిస్తారు! ఆ తర్వాత కార్యాచరణ ఏం చేయాలో వారిని అడిగి సలహాలు తీసుకుంటారు. అవసరం అయితే.. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్రంలోని పెద్దలతో భేటీ అయ్యే ప్రయత్నం కూడా చేస్తారు.

ఇప్పుడే ఎందుకు చంద్రబాబు అఖిలపక్షం మాటెత్తుతున్నారు... అనేది కీలకంగా పరిగణించాల్సిన విషయం. రాష్ట్రానికి న్యాయం చేస్తా.. విభజన హామీలను సాధిస్తా.. కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తా.. అద్భుతాలు సృష్టించేస్తా లాంటి పడికట్టు మాటలను ఆయన ఇన్నాళ్లూ అనేకం చెబుతూ వచ్చారు. అయితే ఏ నాడు కూడా కేంద్రంనుంచి రావాల్సిన వాటి విషయంలో గట్టిగా పట్టు బట్టింది లేదు... నిర్దిష్టమైన ప్రయత్నం చేసింది లేదు. ఏదో చాకలిపద్దు రాసినట్లుగా ఢిల్లీ యాత్రకు ఎన్నిసార్లు వెళ్లివచ్చారో లెక్క రాసుకున్నారు తప్పితే... నిర్దిష్టమైన ప్రయత్నం ఏం జరిగిందనేది అందరికీ తెలుసు.

మరో విషయాన్ని గమనించాలి. కొత్త రాష్ట్రం - కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలినాటినుంచి.. రాష్ట్రంలో పాలకపక్షం తప్ప దాదాపుగా ప్రతి పార్టీ కూడా అఖిలపక్షం ఏర్పాటుచేయాలనే మాట ప్రస్తావిస్తూనే ఉన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళితే.. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని.. రాష్ట్రమంతా సమష్టిగా ఒకే డిమాండుతో ఉన్నదనే సంగతి కేంద్రానికి తెలిస్తే ఒత్తిడి పెరుగుతుందని దాదాపుగా అన్ని పార్టీలూ కోరాయి. కానీ, కేంద్రంలో తాను కీలక భాగస్వామిగా ఉండగా - మళ్లీ అదే కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లడం ఏంటి.. క్రెడిట్ ను అందరితో కలిసి పంచుకోడం ఏంటి? అని చంద్రబాబు అహంకారానికి పోయారు.

ఆయన అఖిలపక్షం అనే విషయంలో నాలుగేళ్లు పాటు చేసిన మితిమీరిన జాప్యం అనేది రాష్ట్రానికి ఎంత శాపంగా మారిందో ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పుడు మళ్లీ ఆయనే అఖిలపక్షం పాట పాడుతున్నారు. తనను మించి మిగిలిన పార్టీలు (ఆయన భాషలో) ‘అప్పర్ హేండ్’ అయిపోతున్నప్పుడు.. క్రెడిట్ ను అందరికీ పంచేయడానికి ఈ అఖిలపక్షం అనేది తాజా వ్యూహం లాగా ఉందని అంతా అనుకుంటున్నారు.