Begin typing your search above and press return to search.

జగన్ తెగువ...చంద్రబాబులో కొంతైనా ఉందా!

By:  Tupaki Desk   |   1 Nov 2017 4:12 AM GMT
జగన్ తెగువ...చంద్రబాబులో కొంతైనా ఉందా!
X
వేరే పార్టీలోంచి తమ పార్టీని లోకి వచ్చిన నాయకుడు తనకు ఉన్న పదవికి రాజీనామా చేసేస్తూ దాన్ని తన చేతికి సమర్పించినప్పుడు... ఆ పదవి కోల్పోయేలా దాన్ని సంబంధిత వర్గాలకు పంపడం అంటే.. అందుకు చాలా ధైర్యం కావాలి. తమ నేతకు పదవి పోతున్నా సహించే స్థైర్యం కావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ విషయంలో ఆ లక్షణాల్ని నిరూపించుకున్నారు. నంద్యాల ఎన్నికల సమయంలో అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు - చక్రపాణి రెడ్డి కేవలం కొన్ని నెలల కిందట తనకు దక్కిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేసి ఆ రాజీనామాలేఖను జగన్ చేతుల్లో పెడితే.. ఆయన వెంటనే దానిని మండలి ఛైర్మన్ కు పంపి - ఆమోదం పొందేలా చేశారు. ఆ రకంగా తమ పార్టీలోకి నేతలు వచ్చినప్పుడు పదవుల్ని తృణప్రాయంగా త్యజించగల ధైర్యం తమకు ఉన్నదని జగన్ నిరూపించారు.

అయితే అదే తెగువ - ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో ఉన్నాయా లేదా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన వ్యక్తి.. తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా లేఖను తన చేతుల్లో పెట్టేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన తర్వాత కూడా చంద్రబాబునాయుడు ఆ రాజీనామాను సంబంధిత స్పీకరుకు పంపకుండా కాలయాపన చేయడంలో అంతరార్థం మరొకటి ఏమైనా ఉన్నదా అనే సందేహాలు పలువురికి కలుగుతున్నాయి.

రేవంత్... విజయవాడలో చంద్రబాబును కలిసినప్పుడే పార్టీకి రాజీనామా చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేసి ఆ లేఖను కూడా చంద్రబాబుకే ఇచ్చారు. అచ్చంగా స్పీకరు ఫార్మాట్ లోనే వెంటనే ఆమోదం పొందేలా ఆయన రాజీనామా చేశారు. అయితే చంద్రబాబునుంచి ఆ లేఖ ప్రతి మాత్రం.. తెలంగాణ స్పీకరు కార్యాలయానికి మంగళవారం వరకూ చేరలేదనే తెలుస్తోంది. రేవంత్ కూడా తాను మరొక ప్రతిని స్పీకరు కార్యాలయానికి చేర్చడం గురించి పట్టించుకోలేదు. రేవంత్ రాజీనామా స్పీకరు కార్యాలయానికి వస్తే.. ఆ తర్వాత.. స్పీకరు ఆయనను పిలిపించి మాట్లాడి ఆ తర్వాత రాజీనామా పై నిర్ణయం తీసుకుంటారని.. దీనికంతా కొంత సమయం పడుతుందని అంచనాలు సాగుతున్నాయి. అయినా.. తమ పార్టీ నాయకుడు ఇతర పార్టీలో చేరిపోయినా కూడా ఆ రాజీనామా లేఖను చంద్రబాబు పంపకపోవడం ఎందుకో అర్థం కావడం లేదు. దానిని ఆమోదానికి పంపిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తాను ఫిరాయింపజేసి తమ పార్టీలో కలిపేసుకున్న వారందరితో రాజీనామాలు చేయించాలనే నైతిక డిమాండ్ తలెత్తుతుందని అనుకుంటున్నారా? ఏమో మరి!!