Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌వాల్‌ ను బాబు ట్విస్ట్ చేస్తారెందుకు?

By:  Tupaki Desk   |   29 Aug 2017 12:19 PM IST
జ‌గ‌న్ స‌వాల్‌ ను బాబు ట్విస్ట్ చేస్తారెందుకు?
X
అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా.. ఉత్కంట‌గా ఎదురుచూసిన నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితం వ‌చ్చేసింది. వంద‌లాది కోట్ల రూపాయిల డ‌బ్బు.. అధికారాన్ని అన్ లిమిటెడ్ గా వాడేసిన బాబు అండ్ కో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అభివృద్ధి కావాలంటే త‌మ‌కు ఓటు వేయాల‌న్న మాట‌తో అధికార బెదిరింపుల‌కు పాల్ప‌డిన తెలుగు త‌మ్ముళ్ల దెబ్బ‌కు నంద్యాల ఓట‌ర్లు లొంగార‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితం త‌ర్వాత ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రియాక్ట్ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితం నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ద‌మ్ముంటే.. త‌మ పార్టీ గుర్తు మీద గెలిచి.. అధికార‌ప‌క్షంలోకి వెళ్లిన 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లే ధైర్యం ఉందా? అంటూ స‌వాలు విసిరారు.

నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా మొత్తం మంత్రుల్ని కూర్చోబెట్టి.. రూ.200 కోట్ల డ‌బ్బు పంపిణీ చేసి.. పింఛ‌న్‌.. రేష‌న్ ఆపేస్తామంటూ ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసి గెలిచిన చంద్ర‌బాబు.. పార్టీ నుంచి జంప్ అయిన 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేసి ఎన్నిక‌ల గోదాలోకి దిగ‌గ‌ల‌రా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ స‌వాలులో ఎలాంటి ట్విస్ట్ లేదు. సూటిగానే ఉంది. కానీ..జ‌గ‌న్ స‌వాలుపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం భిన్నంగా రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ స‌వాలు విసిరిన 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే అంశంపై మాట కూడా మాట్లాడ‌ని ఆయ‌న‌.. ఎంపీల చేత రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు దిగుతారా? అంటూ ట్విస్ట్ స‌వాలును తెర మీద‌కు తీసుకురావ‌టం క‌నిపిస్తుంది.

ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ పై పోరాడే స‌మ‌యంలో జ‌గ‌న్ చెప్పిన మాట‌ను తెర మీద‌కు తీసుకొచ్చిన బాబు.. ఎంపీల చేత రాజీనామా చేయిస్తారా? అంటూ ప్ర‌శ్నించ‌టం చూస్తే.. జ‌గ‌న్ పార్టీ నుంచి జంప్ అయి వ‌చ్చిన‌ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే ఉద్దేశం త‌న‌కు లేద‌న్న విష‌యాన్ని చెప్పేశార‌ని చెప్పాలి. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో భాగంగా ఎంపీల చేత రాజీనామా చేయించ‌టం వ్యూహాత్మ‌క‌మైన‌ది.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం అదెప్పుడు చేయాలో జ‌గ‌న్‌ కు బాగా తెలుసు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని నీరుకార్చే విష‌యంలో నూటికి నూరుశాతం విజ‌యం సాధించిన చంద్ర‌బాబు.. అందుకు ఫ‌లితం ఎప్పుడో ఒక‌ప్పుడు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. కోట్లాదిమంది సీమాంధ్రుల ప్ర‌యోజ‌నాల్ని మోడీకి తాక‌ట్టు పెట్టిన పాపం ఏదో ఒక రోజు పండ‌క మాన‌ద‌న్న విమ‌ర్శ ప‌లువురి నోట వినిపిస్తోంది.

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌మ ఎంపీల చేత రాజీనామా చేయిస్తాన‌న్న జ‌గ‌న్ మాట‌పై ఇప్ప‌టి మాదిరే గ‌తంలో కూడా చంద్ర‌బాబు రియాక్ట్ అయి ఉంటే అదో ప‌ద్ధ‌తిగా ఉండేది. అప్ప‌ట్లో కామ్ గా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు మాత్రం ఎంపీల చేత రాజీనామా చేయించాలంటూ మాట్లాడుతున్న వైనం చూస్తే.. జ‌నం దృష్టిని త‌ప్పించ‌టానికే త‌ప్పించి.. జ‌గ‌న్ స‌వాలును స్వీక‌రించే స‌త్తా లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల‌కు దిగ‌టం అంటే సూసైడ్ అటెంప్ట్ అన్న విష‌యం బాబుకు తెలియంది కాదు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌న డ‌బ్బు.. ప‌వ‌ర్ తో పాటు.. భూమా మ‌ర‌ణం మీద ఉన్న సానుభూతి వ‌ర్క్ వుట్ అయ్యేలా చేశాయి. కానీ.. జంప్ జిలానీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని.. అంత భారీగా మంత్రాంగాన్ని తాను నిర్వ‌హించ‌లేద‌న‌న్న విష‌యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌టానికి వీలుగా చంద్ర‌బాబు..ఎంపీల రాజీనామా స‌వాలును తెర మీద‌కు తెచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.