Begin typing your search above and press return to search.

ఎన్నికలు అంటేనే భయపడుతున్న చంద్రబాబు!

By:  Tupaki Desk   |   9 Sept 2015 9:43 AM IST
ఎన్నికలు అంటేనే భయపడుతున్న చంద్రబాబు!
X
పాలకులు ఎవరనే కీలక విషయాన్ని నిర్దేశించే అసెంబ్లీ, ఎంపీ వంటి ఎన్నికలు మాత్రమే కాదు.. ప్రస్తుత వాతావరణంలో పల్లెటూర్లలో జరిగే నీటి సంఘాల ఎన్నికలంటే కూడా చంద్రబాబునాయుడు భయపడుతున్నారా? ప్రస్తుత వాతావరణం చూస్తోంటే మాత్రం అలాగే అనిపిస్తోంది. ఎన్నిక అంటూ జరిగితే.. ఓట్లు.. వాటి శాతాలు ఇవన్నీ లెక్కతేలుతాయని.. అసలే రైతన్నలో ప్రస్తుత వాతావరణంలో ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి ఉండే నేపథ్యంలో ఎన్నిక అనే విధానానికి వెళ్లకపోవడమే మంచిదని చంద్రబాబునాయుడు సర్కారు భావించినట్లు కనిపిస్తోంది.

ఇందుకు గాను సాగునీటి సంఘాల చట్టానికి ఇటీవల చేసిన సవరణలోని వెసులుబాటును అధికార పార్టీ వాడుకుంటోంది. ఎన్నికలు నిర్వహించకుండా.. సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేసి మెజారిటీ సభ్యుల అనుమతితో కమిటీని ఎంపిక చేయవచ్చునని ఇటీవల సవరించారు. ఆ మేరకు ఎంపికలే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలంటే రహస్య బ్యాలెట్‌ లో జరుగుతాయి గనుక.. రైతులకు స్వేచ్ఛ ఉంటుంది. అదేఎంపిక అంటే.. సర్వసభ్య సమావేశంలో అందరి ముందు చెప్పాలి. సహజంగా అధికార పార్టీకి ఎడ్వాంటేజీ ఉంటుంది. పైగా ఈ సమావేశాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా కూర్చుంటారు. వారి ముందు వ్యతిరేకతను కనబరచడం కష్టం గనుక.. తెలుగుదేశానికి మైలేజీ దక్కుతోంది.

ఏది ఏమైనప్పటికీ.. అసలు ఎన్నికలు అనే పదానికే చంద్రబాబు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడిపోతే.. రాజధాని, ఇతర హంగామా దృష్ట్యా తాను ప్రదర్శిస్తన్న దూకుడు మీద కూడా ప్రభావం పడుతుందని.. చంద్రబాబునాయుడు భయపడుతుండవచ్చు. నీటిసంఘాల కార్యవర్గాల్ని ఎంపికలతో పరిమితం చేయడం పట్ల విపక్షాలు మాత్రం విరుచుకుపడుతున్నాయి.