Begin typing your search above and press return to search.

అడుక్కోవాల‌న్నా మీకు ప‌ట్ట‌దా బాబు?

By:  Tupaki Desk   |   1 Oct 2017 11:08 AM IST
అడుక్కోవాల‌న్నా మీకు ప‌ట్ట‌దా బాబు?
X
"మంచి కావొచ్చు చెడ్డ కావొచ్చు. మొద‌టి నుంచీ ఆంధ్రా ప్ర‌భుత్వం తీరు మొగుడిని కొట్టి మొగ‌సాల‌కు ఎక్కిన‌ట్టు ఉంటోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగ‌ర్‌ కు నీళ్లు పోవ‌ద్ద‌ని అంటారు వాళ్లు. ఏం వాద‌నండి అది? శ‌్రీశైలం ఒరిజిన‌ల్ గా క‌ట్టిన‌నాడు.. అది జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టు. ఇరిగేష‌న్ ప్రాజెక్టు కానే కాదు. కానీ.. శ్రీశైలంకు చిల్లు పెట్టి దందాల‌న్నీ చేసిండ్రు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఎట్లా తీసుకున్నారు? ట‌్రైబ్యున‌ల్ ఛైర్మ‌న్ శ్రీవాస్త‌వ‌ను కూడా నేను అడుగుతున్నా. శ్రీశైలం నుంచి సాగ‌ర్‌ కు నీళ్లు పోవద్ద‌ని ఎలా చెబుతారు? దానికి నీళ్లు త‌ప్ప‌క ఇవ్వాల్సిందే. ఆ మేర‌కు కేటాయింపులు ఉన్నాయి. సోకాల్డ్ పోతిరెడ్డిపాడుకు నీళ్లు కావాలంటే వాళ్లు మాట్లాడాలి. రిక్వెస్ట్ చేయాలి. అడుక్కోవాలి. అంతేకానీ దాదాగిరి చేసి తీసుకొని పోలేరు. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే హ‌క్కు సాగ‌ర్‌కు.. కృష్ణా డెల్టాకు.. జూరాల‌కు.. ఆర్డీఎస్‌ కు.. బీమా ప్రాజెక్టుల‌కు ఉంది. వాటికి నీళ్లు ఇచ్చాకే మిగిలిన చోట్ల‌కు తీసుకెళ్లాలి"

ఈ మాట‌ల‌న్నీ మాట్లాడింది ఎవ‌రో కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ద‌స‌రా పండ‌గ ముందు రోజు గంట‌కు పైగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు.. త‌న‌కేమాత్రం న‌చ్చ‌నోళ్లంద‌రిని క‌డిగి పారేసేందుకు డిసైడ్ అయిన కేసీఆర్‌. ఇష్టారాజ్యంగా తిట్టిపారేశారు. ఉద్య‌మ స‌మ‌యంలోనూ.. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఆంధ్ర పాల‌కులు త‌మ‌ను అవ‌మానించార‌ని.. దారుణంగా వంచించారంటూ ప‌దే ప‌దే చెప్పుకునే కేసీఆర్‌.. త‌న‌కు తాను అదే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం ఇక్క‌డ అభ్యంత‌రం.

ఒక‌రి మాట కార‌ణంగా త‌మ మ‌న‌సులో నొచ్చుకున్నాయ‌ని ఫీల‌య్యే పెద్ద‌మ‌నిషి.. తాను కూడా అదే ప‌ని ఎందుకు చేయాలి? అన్న‌ది ఇక్క‌డ ప్ర‌శ్న‌. విడిపోయి క‌లిసి ఉందామ‌ని చెప్పి మ‌రీ విభ‌జ‌న‌కు ముందు మాట‌లు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. మ‌న‌సులు గాయ‌ప‌రిచేలా.. ఉద్రిక్త‌త‌లు పెంచేలా మాట్లాడ‌టం ఆయ‌న‌కే చెల్లింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఎంత కీల‌క‌మో.. అంత‌కు మించి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఉద్య‌మ నేత కోదండ‌రాం. ఆ విష‌యం తెలంగాణ‌లోనే కాదు.. ఏపీలోని చిన్న‌పిల్లాడికి కూడా తెలుసు. అలాంటి కోదండ‌రాం లాంటోడినే తాడు బొంగ‌రం లేనోడిగా.. ఆయ‌న అస‌లు ఎవలు.. ఏంది? ఆయ‌న క‌థేంది? నెత్తిలేనోడు.. క‌త్తి లేనోడు.. ఏది ప‌డితే అది మాట్లాడ‌త‌డు అంటూ విరుచుకుప‌డ‌టం చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే. సొంత మ‌నుషుల మీద‌నే ఇంత విషం క‌క్కినోడికి.. తాను నిత్యం ద్వేషించే ఆంధ్రోళ్ల‌ను అడుక్కోవాల‌న్న మాట‌ను అన‌టంలో పెద్ద విశేషంగా ఏమీ అనిపించ‌దు.

పండ‌గ ముందు రోజు త‌న ఆగ్ర‌హాన్ని మాట‌ల‌తో నింపేసి మీడియా ముందు దులిపేయ‌గా.. కేసీఆర్ అంతేసి మాట‌ల‌న్నా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కించిత్ కూడా రియాక్ట్ కాని ప‌రిస్థితి క‌నిపిస్తుంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విష‌యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఏపీ ముఖ్య‌మంత్రి.. ఏపీ రాష్ట్ర ఇరిగేష‌న్ మంత్రికి బాధ్య‌త ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కానీ.. వారు ఇరువురు నోరు విప్ప‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. క‌నీసం ప్రెస్ నోట్ రూపంలో అయినా ఖండించి ఉండాల్సింద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నీటి విష‌యంలో భౌగోళికంగా ఎగువ ప్రాంతంలో ఉన్న వారిదే పైచేయి. వారి ద‌య మీద‌నే దిగువ ప్రాంతాల వారు ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. అంత మాత్రం చేత అడుక్కోవాలంటూ నోరు పారేసుకోవ‌టం మంచిది కాదు.

ఇప్ప‌టికే అల్మ‌ట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేసిన క‌ర్ణాటక రాష్ట్రం పుణ్య‌మా అని కృష్ణా జ‌లాలు రావాల్సినంత రాని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. రేపొద్దున క‌ర్ణాట‌క కూడా నీళ్లు కావాలంటే అడుక్కోండి అంటే? అదొక్క‌టే కాదు.. తెలంగాణ‌కు రావాల్సిన నీళ్ల‌ను బాబ్లీ ప్రాజెక్టుతో అడ్డుకుంటున్న మ‌హారాష్ట్ర స‌ర్కారు.. తెలంగాణ నీటి అవ‌స‌రాన్ని ఉద్దేశించి.. అడుక్కుంటే నీళ్లు ఇస్తామ‌న్న మాట అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌కేసీఆర్ ఆ మాట‌ను ప‌డ‌తారా?

ఒక‌వేళ‌.. అడుక్కునే మాట‌ను ఇంకెవ‌రైనా అని ఉంటే.. కేసీఆర్ ఎంతెత్తు లేచేవారు అంద‌రికి తెలిసిందే. ఆ మాట మ‌రే రాజ‌కీయ‌నేత నోటైనా వ‌చ్చి ఉంటే ఆగ‌మాగం చేసేవారు. తెలంగాణ స‌మాజం మొత్తం ర‌గిలిపోయేలా రియాక్ట్ అయ్యేవారు. మ‌రి.. అంత‌లా స్పందించే ఆయ‌న‌.. త‌న నోటి మాట‌తో వేరే వారి మ‌న‌సుల్ని గాయ‌ప‌ర్చ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న కేసీఆర్‌ కు ఎందుకు రాదు?

ఎంత త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ఉంటే మాత్రం కోట్లాది మంది ప్ర‌జ‌ల్ని అంతేసి మాట అంటారా? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఆత్మ‌గౌర‌వం ఎవ‌రికైనా ఒకేలా ఉంటుంద‌ని.. ఒక‌వేళ‌.. ఆంధ్రా స‌ర్కారు త‌ప్పు చేసి ఉంటే.. న్యాయ‌పోరాటం చేయాలి.. వారి త‌ప్పుల్ని ఫ్రూవ్ చేయాలే త‌ప్పించి నోరు పారేసుకోకూడ‌దు. అదేమ‌న్నా అంటే.. ఆంధ్రా పాల‌కుల్ని అన్నానే కానీ ఆంధ్రా ప్ర‌జ‌ల్ని తాను ఏమీ అన‌లేద‌ని చెప్పే కేసీఆర్‌.. ఆంధ్రా పాల‌కులు అంటే ఆంధ్రా ప్ర‌జ‌లేన‌న్న లాజిక్ ఆంధ్రోళ్ల‌కు క‌ల‌గ‌కుండా చేస్తారు. త‌న మేజిక్ మాట‌ల‌తో నొప్పించే కేసీఆర్ మాట‌ల్ని ఇప్పుడు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుంటే.. రేపొద్దున మ‌రిన్ని మాట‌లు ప‌డాల్సి ఉంటుంది.

అయినా.. మాట‌ల‌తో మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచే హ‌క్కు ఎవ‌రికీ లేదు. నిజంగానే త‌ప్పు జ‌రిగి ఉంటే.. దాన్ని పోరాడి సాధించుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆంధ్రుల‌ను ఉద్దేశించి అంతేసి మాట కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చినా.. ఎలాంటి రియాక్ష‌న్ లేకుండా ఉన్న చంద్ర‌బాబు తీరుపై ఇప్పుడు ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. లైవ్ లో వ‌చ్చిన మీడియా స‌మావేశంలో అంత తీవ్ర‌స్థాయిలో కేసీఆర్ మాట అన్నాక అయినా.. స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. అలాంటిదేమీ ప‌ట్ట‌ని చంద్ర‌బాబు తీరు ఆంధ్రోళ్ల మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచేలా ఉంద‌న‌టంలో సందేహం లేదు.