Begin typing your search above and press return to search.

బాబు చూపు దేశం వైపు- 'దేశం' చూపు నేల వైపు

By:  Tupaki Desk   |   24 Nov 2018 9:57 PM IST
బాబు చూపు దేశం వైపు- దేశం చూపు నేల వైపు
X
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అట‌. ఎక్క‌డుంది అని అడ‌క్కండి. ఎవ‌రి పార్టీ గురించి వారు ఏమైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఆ పార్టీ వాళ్లకు ఉండ‌దా ఏంటి? చ‌ంద్ర‌బాబు ఏమో నేనే మ‌హాకూట‌మిని క‌ట్టాను. దేశంలో పార్టీ ల‌న్నీ నామాటే వింటున్నాయి. ఇక ప్ర‌ధాని నా జేబులో ఉంటాడు అంటూ క‌బుర్లు చెబుతూ శాలువాలు పట్టుకుని దేశ‌మంతా తిరుగుతుంటే... పార్టీ నాయ‌కులు ఏమో సామంత రాజుల్లా నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏలుతున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు దేశాన్ని ఏలుతా అని తిరుగుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఎంచ‌క్కా నిధులు భోంచేస్తున్నారు. ఆర్నెల్లు ఆక‌లితో ఉన్న బ‌కాసురుల్లా పింఛ‌ను నుంచి ఇల్లు వ‌ర‌కు ఏ ప‌థ‌క‌మూ వ‌ద‌ల‌కుండా క‌మీష‌న్ల కౌంట‌ర్లు ఓపెన్ చేశారు. ఏ ప‌థ‌క‌మైన ఇచ్చేది న‌చ్చిన వారికే... కానీ వారు కూడా క‌మీష‌న్లు ఇవ్వ‌క త‌ప్ప‌దు. దీంతో ఇత‌ర పార్టీ కార్య‌క‌ర్త‌లు - త‌ట‌స్థులు తెలుగుదేశం పార్టీని తీవ్రంగా అస‌హ్యించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అక్క‌డిదాకా అయితే ఓకే... ఏకంగా సొంత కార్య‌క‌ర్త‌లు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు అయితే... ద‌శాబ్దాలుగా పార్టీతో ఉన్న‌వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో సోష‌ల్ మీడియాలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో విప‌రీతంగా పార్టీ ప‌ట్ల‌ వ్య‌తిరేక‌త పాకుతోంది. అభిమానులు పార్టీని తిట్ట‌లేక త‌మ ఎమ్మెల్యేల‌ను తిడుతూ గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో ప‌రిస్థితి ఉంది.

ఉదాహ‌ర‌ణ‌కు నెల్లూరు జిల్లా నాయ‌కుల ప‌రిస్థితి చూస్తే... ధర్మపోరాట దీక్షకు జనసమీకరణ వీక్ గా ఉండటంతో చంద్రబాబు ఇద్దరు మంత్రులపై అసహనం ప్రదర్శించారట‌. లోతుకు వెళ్తే... జిల్లాలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - మంత్రి నారాయణకు పడదు. అలాగే సోమిరెడ్డికి - ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి పడదు. జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు - ఆదాలకు మధ్య తేడాలున్నాయి. ఇన్ని లొసుగులతో పార్టీ ఎలా గట్టెక్కుతుంది? ఇపుడు అక్క‌డ దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌.

ఇక నిన్న‌ ఈరోజు అనంత‌పురం జిల్లా నేత‌ల‌తో చంద్ర‌బాబు స‌మావేశం అయ్యారు. అక్క‌డ ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా ఉన్నాయి. జిల్లాలో క‌ళ్యాణ‌ దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లంగా ఉంది. అలాంటి స్థానాన్ని కూడా చేజార్చుకునే ప‌రిస్థితి తెచ్చారు. కార‌ణం ఎమ్మెల్యే ఉన్నం హ‌నుమంత‌రాయ‌ చౌద‌రి వార‌సులు. పార్టీని వారసుల కోసం తాకట్టు పెట్టేలా నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తిని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశార‌ట‌. అలాగే శ్రీ‌రాం వ‌ల్ల ప‌రిటాల సునీత‌కు బాబు క్లాసు పీకారు. జేసీ దివాక‌ర్ ప‌రిస్థితీ ఇదే. ఎక్క‌డిక‌క్క‌డ గ్రూపులు. చోటా నాయ‌కులు క‌నీసం కొన్ని ఇళ్ల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌కుండా తామే మంజూరు చేసుకుని డ‌బ్బులు తినేస్తున్న ప‌రిస్థితి.

అయితే, జాతీయ టూర్లు మానేసి ఎందుకు బాబు ఈ జిల్లా టూర్లు పెట్టుకున్నారంటే... పార్టీ ప‌రిస్థితి గురించి చేయించిన స‌ర్వేల్లో క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు తెలిశాయ‌ట‌. అందుకే భార‌త‌దేశం క‌థ త‌ర్వాత చూద్దాం... ముందు తెలుగుదేశాన్ని చ‌క్క‌దిద్దుకుందామ‌ని చంద్ర‌బాబు ఈ టూర్లు పెట్టుకున్నారు. ఇంట గెల‌వ‌కుండా ర‌చ్చ గెలుద్దామ‌ని చూస్తే ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది మ‌రి.