Begin typing your search above and press return to search.

బాబు స‌మ‌క్షంలోనే కాపుల‌కు అవ‌మాన‌మా?

By:  Tupaki Desk   |   14 Aug 2017 10:35 AM GMT
బాబు స‌మ‌క్షంలోనే కాపుల‌కు అవ‌మాన‌మా?
X
కాపుల‌కు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామ‌ని, కాపుల కోసం ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటుచేసి వారికి న్యాయం చేస్తామ‌ని.. సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నారు. అంతేగాక కాపుల హక్కుల కోసం పోరాడుతున్న ముద్ర‌గ‌డ ప‌ద్మనాభంపై కాపు సామాజిక‌వ‌ర్గ మంత్రులంతా మూకుమ్మ‌డిగా విమ‌ర్శ‌ల దాడి చేయ‌డం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం సమ‌క్షంలోనే కాపు నేత‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింది. కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ కు - కాపు నేత‌ల‌కు మ‌ధ్య విభేదాలు మ‌రోసారి సీఎం సాక్షిగా బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. కాపు నేత‌ల మ‌ధ్య గ‌ల‌ అంత‌ర్గ‌త క‌ల‌హాలు భ‌గ్గుమన్నాయి. కాపు నేత మాట్లాడుతుండ‌గా.. ఆ సామాజిక వ‌ర్గానికే చెందిన మంత్రి అడ్డుత‌గ‌ల‌డం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కాపు నేతలతో భేటీ అయ్యారు. ఆయ‌న సమక్షంలోనే కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయులుకు తీవ్ర‌ అవమానం జరిగింది. ఈ స‌మావేశంలో రామానుజులు త‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. మాట్లాడుతున్న స‌మ‌యంలో.. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ - హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హఠాత్తుగా లేచి, ఆయన వద్ద నుంచి మైక్ ను దురుసుగా లాక్కున్నారు. ఒక్కసారిగా చినరాజప్ప ఇలా వ్యవహరించడంతో రామానుజయులు ఖంగుతున్నారు. అంతేగాక అక్క‌డే ఉన్న వారంతా అవాక్క‌య్యారు.

మరోవైపు కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌రో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. దీంతో పార్టీలోనే అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. గతంలోనూ ఆయ‌న‌ కాపులకు జ‌రుగుతున్న అన్యాయం, వారి ప‌ట్ల‌ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వంటి విష‌యాల్లో చంద్రబాబుతో ఆయన విభేదించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గంటా గైర్హాజరు వెనుక ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని, చంద్రబాబుపై అసంతృప్తితోనే ఆయ‌న స‌మావేశానికి గైర్హాజ‌ర‌య్యార‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి.