Begin typing your search above and press return to search.

బ్రిటీషోళ్ల కలెక్టర్ వద్దంటున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   18 Sep 2015 7:28 AM GMT
బ్రిటీషోళ్ల కలెక్టర్ వద్దంటున్న చంద్రబాబు
X
గోదావరి నీటిని కృష్ణానదిలోకి మళ్లించి.. అందరూ ఆడిపోసుకున్న పట్టిసీమ ప్రాజెక్టుతో ఫలితం చూపించిన చంద్రబాబు ఆత్మవిశ్వాసం పెరిగింది.... పైగా ప్రపంచ బ్యాంకు ఏపీకి రెండో ర్యాంకు ఇవ్వడంతో మరింత బలం వచ్చింది... ఈ నేపథ్యంలోనే ఆయన కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకుంటూ వాటిని సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో రెండంకెల వృద్ధి సాధించడం కష్టమేమి కాదని చెప్పారు. కలెక్టర్ అనే పదం బ్రిటిష్ కాలం నాటిదని... ఆ పేరు మార్చాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ పదవికి కొత్త పేరు పెట్టాలన్నారు.

విజయవాడలో 13 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి కోసం 7 మిషన్లు, 5 గ్రిడ్లు ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలో అభివృద్ధికి ఎన్నో వనరులు ఉన్నాయని చెబుతూ.... వనరులను సక్రమంగా వినియోగిస్తే రెండంకెల వృద్ధిరేటు సాధించగలమన్న విశ్వాసం వ్యక్తంచేశారు. సింగపూర్‌ - టర్కీ - దుబాయ్‌ వంటి దేశాల నుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకోవచ్చని ఆయన కలెక్టర్ లతో అన్నారు.

ప్రపంచంతో పోటీ పడి పని చేస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. జలవనరుల శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పట్టిసీమ వద్దే ఉండి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇది టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నందున కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలన్నిటినీ సమన్వయపరిచి జిల్లాల్లో పాలన సజావుగా సాగించాలని ఆయన కలెక్టర్ లకు సూచించారు.