Begin typing your search above and press return to search.

వైసీపీ భయం.. బీజేపీ భక్తి.. బాబు స్కెచ్చేనా?

By:  Tupaki Desk   |   7 Sept 2019 10:37 AM IST
వైసీపీ భయం.. బీజేపీ భక్తి.. బాబు స్కెచ్చేనా?
X
చంద్రబాబు అంటేనే ఇప్పుడు బీజేపీ అగ్గిమీద గుగ్గిలంలా మంటగా ఉంది. ఆ మంటను చల్లార్చాలి.. బీజేపీతో మళ్లీ దోస్తీ కట్టాలి. పోయిన తన ఇమేజ్ ను మళ్లీ తెచ్చుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలి..? ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు మెదడుకు పదును పెట్టి మరీ ఆలోచించి తన దిగ్గజ నేతలను వ్యూహాత్మకంగా టీడీపీ నుంచి బీజేపీలోకి పంపిస్తున్నట్టు అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

మొన్నటికి మొన్న చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు - పార్టీని నడిపించే శక్తులు లాంటి వారైన టీడీపీ నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి - సీఎం రమేష్ - మరో ఇద్దరు బీజేపీలో చేరడమే పెద్ద అనూహ్యమైన నిర్ణయం.. చంద్రబాబుకు బ్యాక్ ఎండ్ గా వ్యవహరించే వీళ్లు చంద్రబాబుతో భేటి అయ్యాకే బీజేపీలో చేరడం అందరిలోనూ అనుమానాలు పెంచింది.

తాజాగా టీడీపీ మాజీ మంత్రి - కడప సీనియర్ నేత కూడా నిన్న చంద్రబాబుతో భేటి అయ్యి చర్చలు జరిపి శనివారం బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీన్ని బట్టి ఇదంతా చంద్రబాబు స్కెచ్చేనా అన్న కోణం రాజకీయవర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

బీజేపీలో చేరడం వల్ల టీడీపీని టార్గెట్ చేసే అవకాశం బీజేపీ నేతలు ఉండదు. ఇక వైసీపీని ఈ ఐదేళ్లు కాచుకొని నిలబడాలంటే టీడీపీలో ఉంటే కష్టమే. ఈ రెండు కోణాల్లోనే బాగా ఆలోచించి చంద్రబాబు అండ్ టీం వ్యూహాత్మకంగా వైసీపీ టార్గెట్ చేసే టీడీపీ నేతలను బీజేపీలోకి పంపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని టార్గెట్ చేసిన వారు ఇప్పుడు బీజేపీలో చేరడం వెనుక అసలు వ్యూహం ఇదేనంటున్నారు..