Begin typing your search above and press return to search.

జేసీ వ్యాఖ్యలతో మరింత ఇరకాటంలో చంద్రబాబు!

By:  Tupaki Desk   |   23 April 2019 10:01 AM IST
జేసీ వ్యాఖ్యలతో మరింత ఇరకాటంలో చంద్రబాబు!
X
తన నోటి దురుసుతో పార్టీకి తలనొప్పులు తీసుకురావడం జేసీ దివాకర్ రెడ్డికి కొత్త ఏమీ కాదు. ఒకవైపు చంద్రబాబు నాయుడి భజన చేస్తూనే ఆయనకే కొత్త తలనొప్పులు తీసుకొస్తూత ఉంటాడు ఈ సీనియర్ నేత. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశం బయట జేసీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

ఒకవైపు ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉండగా.. జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము యాభై కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేసినట్టుగా ప్రకటించుకున్నారు. అనంతపురం నుంచి ఎంపీగా తెలుగుదేశం టికెట్ మీద జేసీ తనయుడు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తాము ఒక్క ఎంపీ సీటు పరిధికి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా, ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చినట్టుగా జేసీ చెప్పారు.

ఒకవైపు ఆఫ్ ద రికార్డు ఇన్ఫర్మేషన్ చెబుతున్నట్టుగానే మాట్లాడుతూ.. మరోవైపు జేసీ కెమెరాల ముందు అలా మాట్లాడి డీప్ ట్రబుల్ లో చిక్కుకున్నారు. జేసీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీల వాళ్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. జేసీ వ్యాఖ్యలను బట్టి అనంతపురం ఎంపీ సీటు, తాడిపత్రి ఎమ్మెల్యే సీటు ఎన్నికను రద్దు చేయాలని వారు కోరారు. తాము ఓటుకు డబ్బు ఇచ్చినట్టుగా జేసీ బాహాటంగా చెప్పిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు ఆసక్తిని రేపుతోంది.

ఇక మరోవైపు 'పసుపు- కుంకుమ' విషయంలో జేసీ వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఆ డబ్బులు మహిళలకు చేరాయి కాబట్టి.. తాము సేఫ్ జోన్లోకి వచ్చినట్టుగా జేసీ ప్రకటించుకున్నారు. అంటే పసుపు- కుంకుమ మొత్తాలను ఓటు కొనుగోలుగా వినియోగించినట్టుగా జేసీ దివాకర్ రెడ్డే స్పష్టం చేసినట్టుగా అయ్యింది! టీడీపీ అధినేత చంద్రబాబును ఈ వ్యాఖ్యలు మరింత ఇరకాటంలో పెడుతూ ఉన్నాయి.