Begin typing your search above and press return to search.

ఈ విష‌యం అస‌లెందుకు ప‌ట్టించుకోవ‌ట్లేదు బాబు

By:  Tupaki Desk   |   1 Jan 2017 4:00 AM IST
ఈ విష‌యం అస‌లెందుకు ప‌ట్టించుకోవ‌ట్లేదు బాబు
X
స‌రిగ్గా ఒక‌రోజు క్రితం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో జ‌రిగిన హ‌డావుడి గుర్తుండే ఉంటుంది. పోల‌వ‌రం కాంక్రీటు ప‌నుల ప్రారంభోత్స‌వంతో సృష్టించిన ఈ ప్ర‌చారోత్స‌వంపై బాబు విమ‌ర్శ‌కులు మండిపడుతూనే మ‌రో ముఖ్య‌మైన అంశాన్ని ఆయ‌న‌కు గుర్తుచేస్తున్నారు. చంద్ర‌బాబు ప‌దేప‌దే జ‌పించే న‌వ్యాంధ్ర‌ రాజధాని నిర్మాణ ప్రకటనకు నేటితో రెండేళ్లు పూర్తయిందని విమ‌ర్శ‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. వారి అభిప్రాయాల ప్ర‌కారం ఇప్పటి వరకూ తాత్కాలిక సెక్రటేరియట్‌ తప్ప మరోపని జరగలేదు. మొత్తం రాజధానికి రూ.65 వేల కోట్లు అవసరమవుతుందని అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చింది రూ.2500 కోట్లు మాత్ర‌మేన‌ని ఇవి ఏమూల‌కు స‌రిపోతాయ‌ని అంటున్నారు.

2014 డిసెంబర్‌ 30వ తేదీన సిఆర్‌డిఏ ప్రకటన చేశారు. అదే రోజూ రాజధాని ప్రకటనా చేశారు. నేటితో కచ్చితంగా రెండేళ్లు పూర్తయింది. శనివారం సిఆర్‌ డిఏ రెండో వార్షికోత్సవం కోసం ఏర్పాట్లు చేసింది. రాజధాని ప్రకటన సమయంలో 2017 నాటికి దాదాపు సగం పనులు పూర్తవుతాయని ప్రకటించారు. 2018 నాటికి పూర్తిస్థాయి పరిపాలన మొదలవుతుందనీ చెప్పారు. అయితే రాజధాని విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందనే అనుమానాలను సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు ఆధ్వర్యాన ఒక మాస్టర్‌ ప్లానును ఎంపిక చేసిన ప్రభుత్వం దాన్ని మ‌ళ్లీ ఆయ‌న ఆధ్వర్యానే రద్దు చేయడం ప్ర‌స్తావిస్తున్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ టెండర్‌ ను - కన్సార్టియంనూ ఏకపక్షంగా ఎంపిక చేయడంతో హైకోర్టులోనూ కేసు నిలబడలేదు. దీంతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఎన్‌జిటికి కూడా సరైన వివరాలు సమర్పించకపోవడంతో అక్కడ కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేస్తున్నారు. దీంతో పని తీవ్ర జాప్యమైంది. సీడ్‌ బిజినెస్‌ డిస్ట్రిక్‌ లో మాస్టర్‌ డెవపలర్‌ ను ఎంపిక చేయడంతో దానిపైనా విమర్శలు వ్యక్తమై కోర్టు ఆదేశాలతో అది కూడా రద్దయింది. దీంతో ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. నిర్మాణాలకు కేంద్రం రూ.15 వేల కోట్ల రుణం ఇస్తుందనీ వెల్లడించారు. మొత్తం రాజధాని నిర్మాణానికి రూ.65 వేల కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. ప్రభుత్వ సముదాయాలు, హైకోర్టు భవనాలు నిర్మించేందుకు సుమారు రూ.9000 కోట్లు ఖర్చవుతాయని ఈ మొత్తాన్ని కేంద్రం ఇస్తుందని అప్పట్లో ప్రకటించారు.

ఇక రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన వారిలో నిరుద్యోగులందరికీ ఉద్యోగం వస్తుందని - పొలం లేనివారికి పెన్షన్‌ తోపాటు - ఇళ్లూ నిర్మించి ఇస్తామని చెప్పారు. సిఆర్‌డిఏ చుట్టుపక్కలున్న నందిగామ - కంచికచర్ల - గుడివాడ - గన్నవరం - తెనాలి - సత్తెనపల్లి - నరసరావుపేట - చిలకలూరిపేట - మచిలీపట్నం తదితర ప్రాంతాలను గ్రోత్‌ సెంటర్లుగా ప్రకటించారు. వీటికి రాజధాని నుండి గ్రోత్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తామనీ తెలిపారు. ఇవన్నీ కూడా పేపర్లు, ప్రకటనల్లోనే ఉన్నాయి. ఒక్కటి కూడా ముందుకు వెళ్లలేదు. రాజధానికి నిధులూ రాలేదు. కేంద్రం ఇప్పటి వరకూ ఇచ్చింది రూ.2500 కోట్లు మాత్రమే. వాటిల్లోనూ రూ.1000 కోట్లు విజయవాడ - గుంటూరు నగరాలకు కేటాయించారు. రాజధాని గ్రామ కంఠాల సమస్య పరిష్కారానికి ప్రస్తుత కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆధ్వర్యాన ఒక కమిటీని నియమించారు. అయినా పరిష్కారానికి నోచలేదు. రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు 13 గ్రామాల్లో లాటరీలు వేసి నెంబర్లు కేటాయించారు. వారికి ఒక్కరీకి స్థలం ఇవ్వలేదు. కనీసం స్థలం లేఅవుట్‌ కూడా వేయలేదు. అదే సమయంలో విద్యాభివృద్ధి పేరుతో ప్రైవేటు సంస్థలకు 450 ఎకరాలు గజం రూ.1000 చొప్పున కేటాయించారు. కీలకమైన రీజియన్‌ ప్లాను ఇంతవరకూ రూపొందించలేదు. ఉడా ఉన్నప్పుడు వేసిన జోనింగ్‌ ప్లాన్లనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. రాజధానికి అవసరమైన హైవేను వెంటనే నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం రోడ్డు నిర్మాణ గుత్తేదారు వెనక్కు పోవడంతో ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. అదే సమయంలో అభివృద్ధి పనుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి, ప్రధాని మోడీ మరోసారి, కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్టీ ముచ్చటగా మూడోసారి శంకుస్థాపనలు చేశారు. అవి మినహా రాజధాని ప్రాంతంలో ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు - అంటూ విమ‌ర్శ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాబు వీటిని అంగీక‌రించి త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టాల‌ని కోరుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/