Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌పై బాబు మ‌ళ్లీ హ‌ర్ట‌య్యారు

By:  Tupaki Desk   |   20 Jan 2018 6:28 PM IST
త‌మ్ముళ్ల‌పై బాబు మ‌ళ్లీ హ‌ర్ట‌య్యారు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సొంత పార్టీ నేత‌లే ఇబ్బంది పెడుతున్నారట‌. అందులో సాక్షాత్తు మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు, ముఖ్య‌నేత‌లు ఉన్నార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చంద్ర‌బాబే వివ‌రించి వాపోయార‌ట‌. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఇందుకు వేదిక‌గా మారింది. మ‌రోవైపు ఇదే భేటీ వేదిక‌గా..బీజేపీ నేత‌ల‌కు సీఎం చంద్ర‌బాబు ఓదార్పు వ‌చ‌నాలు తెలిపారు.

అమ‌రావ‌తిలో జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో పార్లమెంట్ ఇన్‌ చార్జీల పనితీరుపై సీఎం చంద్ర‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఇంచార్జీలుగా ఉన్న మంత్రులు మరింత కష్టపడాలన్నారు. ప్ర‌స్తుతం ఉన్న‌వారిలో కొంద‌రి ప‌నితీరు బాగాలేద‌ని చంద్రబాబు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. వైసీపీ - కాంగ్రెస్ నుంచి మరికొందరు టీడీపీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటే కొత్తవారిని తీసుకోవచ్చన్నారు. ఈ సంద‌ర్భంగా సంక్రాంతి పండుగ స‌మ‌యంలోని జ‌రిగిన‌ కోడిపందాల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కోడి పందాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశార‌ని స‌మాచారం. సంప్రదాయం ప్రకారం కోడి పందాలు నిర్వహిస్తే తప్పులేదు కానీ పందేలు మేమే నిర్వహిస్తామనే రీతిలో మాట్లాడటం సరికాదన్నారు. ఎన్నికలు ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు నేతలకు క్లాస్‌ పీకారు. జన్మభూమి - ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాలు కొన్ని నియోజకవర్గాల్లో సరిగా జరగలేదని చంద్రబాబు అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

హామీల అమ‌లు విష‌యంలో కోర్టుకు వెళ్తామన్న వ్యాఖ్యలను బీజేపీకి వ్యతిరేకంగా భావించకూడదని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. హామీల అమలు కోసం కోర్టుకు వెళ్లడమనేది ప్రతి ఒక్కరి హక్కు అని చంద్రబాబు స్ప‌ష్టం చేశారు. 9 - 10 షెడ్యూళ్ల విషయంలో ఇబ్బందులు వస్తే కోర్టుకు వెళ్లడం సహజమ‌ని ఆయ‌న అన్నారు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం నుంచి సానుకూల సంకేతాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం దృక్ఫథంలో మార్పు వచ్చిందన్నారు.