Begin typing your search above and press return to search.

ఇంకో కులాన్ని అవమానపరిచిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   31 Dec 2018 12:04 PM IST
ఇంకో కులాన్ని అవమానపరిచిన చంద్రబాబు
X
ఎస్సీగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు అంటూ ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. దళితుల విషయంలో చంద్రబాబుకు ఎంత చిన్న చూపు ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఆ సందర్భంగా ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇంత బాధ్యతా రాహిత్యంతో కూడిన వ్యాఖ్యల్ని జనాలు ఊహించరు. అప్పటి వ్యతిరేకత చూసి అయినా చంద్రబాబు మారి ఉంటారని.. ఇకపై జాగ్రత్తగా వ్యవహరిస్తాడని జనాలు అనుకున్నారు. కానీ ఆయన మారలేదు. ఇప్పుడు మరో కులాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పేందుకు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే.

ఒకప్పుడు తన మంత్రివర్గంలోనే పని చేసిన కేసీఆర్.. తనపై.. తన పాలనపై ప్రశంసలు కురిపించాడని.. కానీ ఇప్పుడు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాడని అన్నాడు చంద్రబాబు. ఈ క్రమంలో కేసీఆర్ తనను ఒకప్పుడు భట్రాజులా పొగిడాడని అన్నాడు. ఇది భట్రాజు కులస్తుల్ని అవమాన పరిచే వ్యాఖ్యే. ఇలా ఒక కులస్థులపై ఒక ముద్ర వేసి ప్రతికూల విషయాలకు ఉదాహరణగా చూపించడం తప్పు. భట్రాజుల విషయంలో ఇంతకుముందు కూడా కొందరు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దానిపై ఆ కులస్థులు నిరసన వ్యక్తం చేశారు. తాజాగా వారికి చంద్రబాబు ఆగ్రహం తెప్పించారు. బాబు వ్యాఖ్యల్ని ఆ కుల సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఇది తమను అవమానించడమే అన్నారు. దీనిపై ఫిర్యాదు చేయనున్నట్లు కూడా వెల్లడించారు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.