Begin typing your search above and press return to search.

చండీయాగంలో హెరిటేజ్ ఘుమఘుమలు

By:  Tupaki Desk   |   24 Dec 2015 12:40 PM IST
చండీయాగంలో హెరిటేజ్ ఘుమఘుమలు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ - ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య బంధం క్రమంగా బలపడుతోంది. చంద్రబాబు నుంచి ఆత్మీయ ఆహ్వానం అందుకుని అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన కేసీఆర్ అక్కడ ఏపీకి ఏం సహాయం కావాలన్నా చేస్తామని మాటిచ్చారు. అలాగే... ఇప్పుడు చండీయాగం చేస్తున్న కేసీఆర్ ఆహ్వానానికీ చంద్రబాబు ఓకే చెప్పారు. 27వ తేదీన ఆయన చండీయాగానికి వెళ్లనున్నారు. అంతేకాదు.... చండీయాగానికి భారీ ఎత్తున పూజాద్రవ్యాలు అవసరం కావడంతో చంద్రబాబు కూడా ఓ చేయి వేశారని సమాచారం. యాగం కోసం 4 టన్నుల నెయ్యి అవసరం కావడంతో అంతపెద్ద మొత్తంలో నెయ్యి ఒకేసారి సమకూర్చుకోవడం కాస్త ఇబ్బందైందట. అప్పుడు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ నుంచి కేసీఆర్ యాగానికి అవసరమైన నెయ్యిని పంపించినట్లు తెలుస్తోంది.

యాగం కోసం మొత్తం ఆవు నెయ్యే కావాల్సి ఉంటుంది. కానీ, ఒక్కసారిగా అంత ఆవు నెయ్యి దొరికే పరిస్థితి లేకపోవడంతో హెరిటేజ్ ని కేసీఆర్ సంప్రదించారని... వెంటనే అందుకు తగ్గ ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. అయితే.... ఇది కూడా చాలా ముందుగానే కేసీఆర్ సమాచారం ఇవ్వడంతో ఆయన కోసం చాలాకాలంగా నెయ్యి తయారుచేసినట్లు తెలుస్తోంది. నమ్మకమైన కాంట్రాక్టర్లు ఒకరిద్దరు కొంత మేర సరఫరా చేసినా మిగిలిందంతా హెరిటేజ్ నుంచే సేకరించారని సమాచారం. హెరిటేజ్ అయితే కల్తీ ఉండదని కేసీఆర్ భావించడం వల్లే ఆ డెయిరీని ఎంచుకున్నారని చెబుతున్నారు.మొత్తానికి చంద్రబాబు, కేసీఆర్ ల స్నేహం ఘుమఘుమలాడుతోంది.