Begin typing your search above and press return to search.

మురిసిపోవ‌టం స‌రే..మ‌రీ విమ‌ర్శ‌లేంది బాబు?

By:  Tupaki Desk   |   16 Dec 2017 5:07 AM GMT
మురిసిపోవ‌టం స‌రే..మ‌రీ విమ‌ర్శ‌లేంది బాబు?
X
అమ‌రావ‌తి మాట వ‌స్తే చాలు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చాలా హ్యాపీగా ఉంటున్నారు. నిజ‌మే.. ఒక సీఎంకు రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించుకునే అవ‌కాశం చాలా అరుదుగా వ‌స్తుంది. ఆ విష‌యంలో మ‌రో మాట లేదు. మ‌రి.. ఆ అవ‌కాశం ద‌క్కిన‌ప్పుడు ఎంత ఆచితూచి అడుగులు వేయాల‌న్న‌దే ఇక్క‌డ పాయింట్‌. అమ‌రావ‌తి న‌గ‌రాన్ని రోజుకో న‌గ‌రంలా మారుస్తామ‌ని ప్ర‌క‌టించే చంద్ర‌బాబు తీరు కామెడీగా మారుతోంది.

తాజాగా అమ‌రావ‌తి డీప్ డైవ్ వ‌ర్క్ షాపు ముగింపు సంద‌ర్భంగా మాట్లాడిన చంద్ర‌బాబు.. ప్ర‌పంచంలోని మేధావుల సూచ‌న‌లు.. స‌ల‌హాలు తీసుకొని ఆంధ్రుల రాజ‌ధానిని అత్యుత్త‌మ రాజ‌ధానిగా తీర్చి దిద్దుతాన‌ని చెప్పారు. అదే త‌న ల‌క్ష్యంగా చెప్పిన ఆయ‌న.. అమ‌రావ‌తి న‌గ‌రాన్ని నిర్మించే అదృష్టం భ‌గ‌వంతుడు త‌న‌కు ఇచ్చిన‌ట్లుగా చెప్పారు.

న‌గ‌రాల్ని నిర్మించే అవ‌కాశం ద‌క్క‌టం మామూలేన‌ని.. కానీ ప‌రిపాల‌న న‌గ‌రాన్ని నిర్మించే అదృష్టం అరుదుగా వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు. రాజ‌ధాని రైతులు త‌న పిలుపుతో 35వేల ఎకరాల్ని ఇచ్చార‌న్నారు. ఏ ప్ర‌జాస్వామ్య దేశంలో ఈ త‌ర‌హాలో భూసమీక‌ర‌ణ జ‌ర‌గ‌లేద‌న్నారు. అమ‌రావ‌తికి తాను చాలా ఇవ్వాల‌న్న ఆయ‌న‌.. ఈ న‌గ‌రాన్ని ప్ర‌పంచ‌శ్రేణి న‌గ‌రంగా కాదు.. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ రాజ‌ధాని న‌గ‌రంగా నిర్మించాల‌ని తాను భావిస్తున్న‌ట్లుగా చెప్పారు.

మాట‌ల్లో ఇంత క‌మిట్ మెంట్ చూపిస్తున్న చంద్ర‌బాబు.. ల్యాండ్ పూలింగ్ విష‌యంలోనూ.. రాజ‌ధాని భూముల‌కు సంబంధించి అనేక విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌టం తెలిసిందే.

రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించే అదృష్టం త‌న‌కు ద‌క్కింద‌ని మురిసిపోతున్న చంద్ర‌బాబు.. మ‌రి ఆ అదృష్టం భూములు ఇచ్చిన రైతుల‌తో పాటు.. త‌న‌కు ఆ అవ‌కాశం ఇచ్చిన ఆంధ్రోళ్ల‌కు క‌లిగేలా చేయాల‌న్న మాట ప‌లువురి నోట వ‌స్తోంది. అమ‌రావ‌తి భూముల‌కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెలువ‌డుతూ.. భారీ అవినీతి పాల్ప‌డిన‌ట్లుగా ఇప్పటికే ప‌లువురు అరోపిస్తున్నారు. మ‌రి.. ఈ విమ‌ర్శ‌ల మాటేంది? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

తాను ఇచ్చిన ఒక్క పిలుపుతో 35వేల ఎక‌రాల్ని ఇవ్వ‌టానికి రైతులు సిద్ధ‌మ‌య్యార‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. మ‌రి అలాంటి రాజ‌ధాని రైతులు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎంత‌టి అసంతృప్తిలో ఉన్నార‌న్న విష‌యాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. మ‌రే న‌గ‌రానికి లేనంత నీరు.. ప‌చ్చ‌ద‌నం అమ‌రావ‌తికి ఉన్నాయ‌ని.. ఇవే ఆ న‌గ‌రానికి అద‌న‌పు వ‌న‌రులుగా అభివ‌ర్ణించారు. అంతా బాగుంద‌ని మురిసిపోతున్న చంద్ర‌బాబు.. అమ‌రావ‌తి విష‌యంలో ఆయ‌న మాత్ర‌మే మురిసిపోతున్నార‌ని.. బాబు మాట‌కు భూములు ఇచ్చిన చాలామంది మాత్రం అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. భూములు ఇచ్చిన వారి అసంతృప్తి మీదా దృష్టి పెడితే బాగుంటుంది.