Begin typing your search above and press return to search.

అమ్మో అమరావతి బాండ్లు

By:  Tupaki Desk   |   3 Sept 2018 1:47 PM IST
అమ్మో అమరావతి బాండ్లు
X
అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణాన్ని చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇందుకోసం చంద్రబాబు నాయుడు అథమ పక్షం 20 దేశాలు చుట్టి వచ్చారు. ఆయనతో పాటు సహచరులూ - వందిమాగదులు కూడా ఈ పర్యటనలో పాల్గోన్నారు. పొరుగున ఉన్న సింగపూర్‌ కు కనీసం 20 సార్లు ముఖ్యమంత్రి - మంత్రి వర్గ సహచరులు - అధికారులు వెళ్లి వచ్చారు. ఆ దేశం నుంచి కూడా వారి మంత్రులు - అధికారులు అమరావతి సందర్శించారు. ఇవన్నీ చేస్తూనే రాజధాని నిర్మాణం కోసం బాండ్లను విక్రయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆ మేరాకు చర్యలు కూడా తీసుకున్నారు. ముంబాయ్ స్టాక్ ఎక్సెంజ్‌ లో గంట కూడా మోగించారు. దేశ చరిత్రలో ఇలా బాండ్ల రూపంలో రాజధాని నిర్మణానికి నిధులు వసూలు చేసింది తామేనని గొప్పగా ప్రకటించుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బాండ్ల విక్రయంలోనే అసలు లొసుగులు వెలుగు చూస్తున్నాయి.

లోక్‌ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ‌్‌ కుమార్ మండిపడుతున్నారు. బాండ్ల కారణంగా ప్రతీ మూడు నెలలకు 10.36 శాతం వడ్డీ చెల్లించాలని అరుణ్‌‌ కుమార్ అన్నారు. ఇది దేశంలో ఎక్కడా లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఈ బాండ్ల విక్రయానికి మధ్యవర్తిగా వ్యవహరించిన వారికి 17 కోట్ల రూపాయలు చెల్లించాలని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని ఉండవల్లి అంటున్నారు. అమరావతి బాండ్ల విక్రయంపై ప్రతిపక్షాలు ఇప్పటికి అనేక సార్లు అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని బాండ్లను కొనుగోలు చేసిన తొమ్మిది మంది పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి కూడా తాజాగా ఈ డిమాండ్ చేసారు. బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాను పారదర్శకతకే విలువ ఇస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ఎందుకు గోప్యత పాటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచీ అమరావతి నిర్మాణంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కానీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పటం లేదు.