Begin typing your search above and press return to search.

అశ్వనీదత్‌ కు బాధ్యతలు ఇచ్చారా కాంట్రాక్టా?

By:  Tupaki Desk   |   10 Oct 2015 3:30 AM GMT
అశ్వనీదత్‌ కు బాధ్యతలు ఇచ్చారా కాంట్రాక్టా?
X
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన నిమిత్తం జరుగుతున్న ఏర్పాట్ల సందర్భంగా.. ఇప్పటికే అయినవారికి పనులు, కేటాయింపులు అన్నీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. కట్టబెడుతున్న కాంట్రాక్టులకు సంబంధించి.. అదేదో బాధ్యతలు అప్పగించాం అంటూ తీయని మాటలతో ప్రభుత్వంలోని పెద్దలు సెలవిస్తున్నారు. కానీ కావల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా.. గోదావరి హారతి కార్యక్రమం అనేది..ప్రస్తుత అమరావతి శంకుస్థాపనతో పోలిస్తే చాలా చిన్న కార్యక్రమం. దానికే సినీ దర్శకుడు బోయపాటిని తీసుకువెళ్లి నానా హడావిడి చేసి భారీ మొత్తాలు తగలేసిన చంద్రబాబునాయుడు అమరావతి శంకుస్థాపన విషయంలో కాసింతయినా వెనక్కు తగ్గుతారా? అసాధ్యం. సినీహంగులు, ఆ భారీతనం.. లేనిది ఉన్నట్లుగా చూపించే.. సినీ మాయాజాలం అన్నీ.. శంకుస్థాపన కార్యక్రమంలో పుష్కలంగా కొలువు దీరబోతున్నాయి. అయితే వీటికి సినీ ప్రముఖుల్ని సలహాల కోసం సంప్రదించాలని కూడా చంద్రబాబు పురమాయిస్తున్నారట.

అయితే.. ఏర్పాట్లకు సంబంధించి కొన్ని బాధ్యతలను ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ కు అప్పగించినట్లుగా అధికారులు చెబుతున్నారు. బాధ్యతలు అప్పగించడం అంటే.. ఏమిటో ఇక్కడ అర్థం కావడం లేదు. ఆయన కూడా ప్రభుత్వంలో ఒక ఉద్యోగి గానీ, లేదా ఒక మంత్రిగానీ అయి ఉంటే బాధ్యతలు అప్పగించి ఉంటే.. ఆయన ఎగబడి ఆ పనులు చేస్తారని అనుకోవచ్చు. అయితే ఆయన ఒక ప్రవేటు వ్యక్తి. సినీ నిర్మాత మాత్రమే. ఆయనకు ఏ హోదాలో బాధ్యతలు అప్పగించారు. ఆయన విరాళంగా తన సొమ్ము తెచ్చి ఖర్చు పెట్టి ఆ బాధ్యతలను నిర్వర్తించబోతున్నారా? అని జనానికి సందేహాలు కలుగుతూ ఉన్నాయి.

ఇంతకూ అశ్వనీదత్‌కు బాధ్యతలు అప్పగించారా? కాంట్రాక్టు పనులు అప్పగించారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఫంక్షన్ల సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి.. కాంట్రాక్టులు తీసుకోవడంలో చాలా లాభం ఉంటుంది. ఇవేవీ శాశ్వతంగా ఉండబోయే పనులు కాదు. ఎంత నాసిరకంగా పనులు చేసినా చెల్లిపోతుంది. ఆ ఒక్కరోజుకు తళుక్కుమంటూ కనిపిస్తే చాలు. ఆ తర్వాత అవి ఎలా నాశనమైనా ఎవ్వరూ అడగరు. భారీ మార్జిన్లు మిగులుతాయి. అశ్వనీదత్‌ తెలివిగా మంచి కాంట్రాక్టునే చేజిక్కించుకున్నారని అంతా గుసగుసలాడుకుంటున్నారు. సినీ హంగుల పేరుమీద ఎంత భారీ ఖర్చు క్లెయిం చేసినా తిరుగుండదు. అదే మరి అమరావతి శంకుస్థాపన సందర్భంగా అయిన వారికి ఆకుల్లో వడ్డించడం అంటే.. అని జనం కామెంట్లు రువ్వుతున్నారు.