Begin typing your search above and press return to search.

ఆర్.కృష్ణయ్యను రంగంలోకి దించిందెవరు?

By:  Tupaki Desk   |   4 Feb 2016 6:42 AM GMT
ఆర్.కృష్ణయ్యను రంగంలోకి దించిందెవరు?
X
కాపులకు ఉన్నఫళంగా రిజర్వేషన్లు ఇవ్వడం అంత సులభం కాదు.. అయినా రాజకీయ అవసరాల కోసం ఆ మాట ఖరాకండీగా చెప్పలేని పరిస్థితి. పైగా ఇప్పటికే కాపు రిజర్వేషన్ల కోసం ఆందోళనలు హింసాత్మకమయ్యాయి. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు కానీ రిజర్వేషన్లపై ఏమాత్రం వెనక్కు తగ్గినట్లుగా కనిపించినా అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో కూడా తెలియదు. అలా అని రిజర్వేషన్లు ఇచ్చినా అదీ ఇబ్బందే. ఏదో కార్పొరేషన్లు - రుణాలు - రాయితీలు అంటూ కొన్నాళ్లు నడిపించొచ్చు అనుకున్న చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం రూపంలో ఊహించని ఉత్పాతం ఎదురైంది. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబును ఇరుకునపెట్టే ప్రయత్నం జరిగింది. అయితే..... ఇలాంటి సంక్షోభ సమయంలో టీటీడీపీ ఎమ్మెల్యే - బీసీ ఉద్యమ నేత - కొన్నాళ్లుగా టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆర్.కృష్ణయ్య రూపంలో దేవుడు దిగొచ్చాడు. ఇంతవరకు చంద్రబాబు ఎడ్డెం అంటే కృష్ణయ్య తెడ్డెం అంటూ తెలంగాణలో నానా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన కాపులకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా, కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు. అయితే... చంద్రబాబుకు మేలే చేయబోతోంది. కాపు రిజర్వేషన్లకు బీసీలు సుముఖంగా లేరు కాబట్టి సయోధ్య కోసం కొంత కాలయాపన చేయడానికి చంద్రబాబుకు బఫర్ టైం దొరికేలా చేస్తోంది.

నిజానికి కృష్ణయ్య ఉద్యమంతో కాపులు కావాలో, బీసీలు కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడేలా కనిపిస్తోంది. అయితే... బీసీ సంఘం నేత అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణయ్య కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిస్తే చంద్రబాబు ఏమాత్రం ఆపే ప్రయత్నం చేయలేదు. నిజానికి చంద్రబాబు చెప్పినా కృష్ణయ్య వినేరకం కూడా కాదు. అయినా, కొందరు మాత్రం దీనిపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

రిజర్వేషన్ల విషయంలో తొందరపాటు వద్దంటూ కాపు నేతలకు సూచిస్తున్న చంద్రబాబు అదే ధోరణిలో సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన కృష్ణయ్యను ఎందుకు శాంతపరచడం లేదని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆర్‌ కృష్ణయ్యకు ఉద్యమాలు కొత్తేమీ కాదంటూ కేబినెట్ భేటీలో చంద్రబాబు స్వయంగా చెప్పడంతో కాపు మంత్రులు సైతం ఆశ్చర్యపోయారు. కాపులకు కౌంటర్‌గా కృష్ణయ్య ఉద్యమించడం చంద్రబాబుకు ఇష్టంగానే ఉన్నట్టుగా ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సూచనలతోనే కృష్ణయ్య కాపు వ్యతిరేక ఉద్యమానికి రెడీ అవుతున్నారన్న వాదన ఒకటి బలంగా వినిపిస్తోంది.