Begin typing your search above and press return to search.

అనంతపురం సంగతిని వదిలేస్తే ఎలా?

By:  Tupaki Desk   |   7 Jan 2016 4:39 AM GMT
అనంతపురం సంగతిని వదిలేస్తే ఎలా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వెనుకపడిన జిల్లా ఏదంటే.. అందరి నోట వచ్చే టాప్ త్రీ జిల్లాల్లో ‘అనంతపురం’ ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. అభివృద్ధి అన్నది కనిపించని ఆ జిల్లాకు కరవుతో విడవని బంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల పద్దులో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపే జిల్లాగా అనంతపురం జిల్లాకు పెద్ద పేరే ఉంది. కాలాలతో సంబంధం లేకుండా తాండవించే కరవు.. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన పరిస్థితులతో పాటు.. ప్రజల వెనుకబాటు అనంత జిల్లాలో అనంతంగా కనిపిస్తుంది.

మరి.. అలాంటి అనంతపురం జిల్లాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మార్చిపోవటం గమనార్హం. జన్మభూమి.. మా ఊరు కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా శ్రీకాకుళం.. కర్నూలు జిల్లాలే అంటూ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ రెండు జిల్లాలతో పాటు.. అనంతపురం జిల్లా వెనుకబాటులో ఉన్నా.. ఆ విషయాన్నిబాబు ప్రస్తావించకపోవటం గమనార్హం.

తాను సీమ బిడ్డనని సగర్వంగా ప్రకటించుకున్న చంద్రబాబు.. సీమలోని నాలుగు జిల్లాల్లోనూ వెనుకబాటుతనం ఎందుకు పోలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదిన్నరేళ్లు.. విభజన అనంతరం దాదాపుగా 19 నెలల నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ కూడా.. తన సొంత ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ఎందుకు తీసుకెళ్లలేకపోయారన్నది ఒక ప్రశ్న. తన ప్రాంతం పట్ల బాబుకు నిజంగా అంత పక్షపాతం ఉండి ఉంటే.. రాయలసీమ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారాల్సింది.

ఇప్పటికి అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్న పరిస్థితి. సీమ దాకా ఎందుకు.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు సంగతేంటి? ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాల్ని పర్యటిస్తే.. చంద్రబాబు సొంత జిల్లాలో ఇన్ని సమస్యలా? ఇంత వెనుకబాటుతనమా? అని ప్రశ్నించుకునేలా పరిస్థితులు కనిపిస్తాయి. తాను సీమ బిడ్డనని సగర్వంగా చెప్పుకునే చంద్రబాబు.. మరి తనకు బతుకునిచ్చిన సీమకు ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీమ అభివృద్ధి విషయంలో నిజమైన కమిట్ మెంట్ ఉంటే.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే అనంతపురం జిల్లాను ఎందుకు మర్చిపోయినట్లో..?