Begin typing your search above and press return to search.

గమనించారా:గన్నవరం నుంచే సింగపూర్ కు

By:  Tupaki Desk   |   20 Sep 2015 9:42 AM GMT
గమనించారా:గన్నవరం నుంచే సింగపూర్ కు
X
ఏ మాత్రం అవకాశం వచ్చినా హైదరాబాద్ ని అంటిపెట్టుకొని ఉండాలన్నట్లు వ్యవహరించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సడన్ గా మారిపోయారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఆయన హైదరాబాద్ లో తిష్ట వేసుకొని ఉండటంపై గతంలో చాలానే విమర్శలు వచ్చాయి. సీమాంధ్రకు చెందిన సామాన్య జనం అయితే.. ఇదెక్కడి గోల అని అనుకునేవారు. పేరుకే ఎపీ సీఎంగా ఉంటున్నారే.. రాష్ట్రంలో అస్సలు ఉండటం లేదే అని వేదన చెందేవారు.

ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ పుణ్యమో ఏమో కానీ.. గోదావరి పుష్కరాల నుంచి చంద్రబాబులో మార్పు చాలా ఎక్కువైంది. హైదరాబాద్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. నిత్యం బెజవాడ మీదనే దృష్టి పెట్టటం మొదలైంది. గతానికి భిన్నంగా ఇప్పుడాయన హైదరాబాద్ వంక చూసేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. విదేశీ పర్యటనల సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చి.. వెళ్లటం జరిగేది. దీనికి భిన్నంగా తాజాగా ఆయన సింగపూర్ పర్యటనను విజయవాడ దగ్గరున్న గన్నవరం నుంచే వెళ్లటం విశేషం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలుత పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ కు వచ్చి.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ద్వారా సింగపూర్ వెళతారని భావించారు. అయితే.. అందుకు భిన్నంగా గన్నవరం నుంచే చంద్రబాబు.. ఆయన బృందం గన్నవరం నుంచే సింగపూర్ కు బయలుదేరి వెళ్లటం గమనార్హం. మొత్తానికి హైదరాబాద్ పొడ పడేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదన్నట్లుగా కనిపిస్తోందే.