Begin typing your search above and press return to search.

ఆరంభ శూర‌త్వ‌మే బాబు అరికాలి మంట‌కు కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   6 Oct 2017 7:00 AM IST
ఆరంభ శూర‌త్వ‌మే బాబు అరికాలి మంట‌కు కార‌ణ‌మా?
X
``ఇంటింటికీ టీడీపీని మీరు లైట్ తీసుకుంటున్నారు. ఇళ్ల‌ల్లోకి వెళ్ల‌ట్లే..ప్ర‌చారం చేయ‌ట్లే..ఇలాగైతే రాబోయే ఎన్నిక‌ల్లో ప‌క్క‌న‌పెట్టేస్తా? మిమ్మ‌ల్ని ఎమ్మెల్సీలుగా పంపిచేస్తా..వేరే వారిని చూసుకుంటా...పార్టీలో ప‌నిచేయ‌క‌పోతే ఎవ‌రికీ భ‌విష్య‌త్ ఉండ‌దు.ఇక‌నుంచైనా జాగ్ర‌త్త‌గా ప‌నిచేయండి`` ఇది ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీకి చెందిన నేత‌ల‌పై నిప్పులు చెరిగిన తీరు. అయితే బాబు ఎందుకు ఇంత‌లా మండిప‌డ్డారు అంటే...అందుకు త‌మ్ముళ్లే కార‌ణ‌మ‌ని అంటున్నారు. అయితే త‌మ్ముళ్లు మాత్రం అదేరీతిలో పార్టీ పెద్ద‌ల‌ను త‌ప్పుప‌డుతున్నారు.

ఇంటింటికీ తెలుగుదేశం ప్ర‌చారం విష‌యంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు మొదట్లో హడావిడి చేశారు. ఈ రిపోర్టుల‌ను పంపించ‌డంతో పార్టీ పెద్ద‌లు ఖుష్ అయిపోయారు. అయితే ఆ త‌ర్వాత ప్రోగ్రెస్ లేద‌ని స‌మాచారం. తెలుగు త‌మ్ముళ్ల ఆరంభ శూరత్వంతో బాబుకు మండిపోయిందని తెలుస్తోంది. వాస్తవానికి నాయకులు - కార్యకర్తలు 50 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నది అధిష్టానం యోచన..సూచన కూడా! అయితే, నాయకుల్లో మొదట్లో ఉన్న వేడి తగ్గడం వల్లనో ఏమో తెలియదు గానీ ఇంటింటికీ టీడీపీ ఆరంభ సమయంలో చేసిన హడావిడి మాత్రం ఇప్పుడు కానరావడం లేదు. సాక్షాత్తు ఆ పార్టీ శ్రేణులు కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్న పరిస్థితి ఉందంటున్నారు. దీనికి ప‌ద‌వుల పందేరం కూడా తోడ‌యింద‌ని అంటున్నారు.

జిల్లా పార్టీ కమిటీలో గానీ, అనుబంధ కమిటీల్లో గానీ పదవులిచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న పెద్దలు తమను ప్రజల్లోకి వెళ్లండంటూ పురమాయించడమే అర్ధరహితమంటూ పలువురు సీనియర్‌ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరికి ఏ పదవులు కట్టబెట్టాలో నిర్ణయించాల్సింది పదవుల్లో ఏన్నవారే కావడం వల్ల ద్వితీయ శ్రేణి నాయకులు గురించి గానీ, కార్యకర్తల గురించి గానీ పట్టించుకోవాలన్న ఆలోచన వారికి రావడం లేదని కొంతమంది బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచిపోయిందని, నామినేటెడ్‌ పదవుల విషయంలో ఎంతోమంది పార్టీ వీరవిధేయులకు సైతం మొండి చేయి చూపిన అధిష్టానం ప్రజల్లోకి వెళ్లండంటూ పనులు పురమాయిస్తే సానుకూలంగా ఎలా స్పందిస్తామని ఇంకొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆవేశాన్ని బహిర్గతం చేసుకుంటే సామాజిక భద్రత పింఛన్లు వంటి చిన్నచిన్న పనులు కూడా చేయించుకునే అవకాశాన్ని కోల్పోవాల్సివస్తుందేమోనన్న భయంతో కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్నామని పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన సీనియర్‌ కార్యకర్తలు సైతం వాపోతున్న పరిస్థితి.

అందుకు తగ్గట్టుగానే పార్టీ అధికారంలో ఉన్నప్ప‌టికీ ప‌లు జిల్లాల్లో టీడీపీ పూర్తి స్థాయి కమిటీ గానీ, అనుబంధ కమిటీలకు గానీ మోక్షం కలగని పరిస్థితిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాగో అధికారంలో ఉన్నాం గనుక పార్టీలో కొనసాగుతున్నామన్న చందంగా పార్టీ వీరవిధేయులుగా ముద్ర పడిన వారు సైతం పేర్కొంటుండడం భవిష్యత్తులో పార్టీపై తీవ్ర ప్రభావం చూపవచ్చన్న సంకేతాలనిస్తోంది. రాజకీయ విశ్లేషకులు సైతం దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం పట్ల ఇటు ద్వితీయ శ్రేణి నాయకులు.. అటు కార్యకర్తలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటింటికీ టీడీపీ కాస్త వీధి..వీధికి, వార్డు..వార్డుకి.. అన్న చందంగా మారిపోయిందని పార్టీ శ్రేణుల్లోనే చర్చలు నడుస్తున్నాయి.