Begin typing your search above and press return to search.

‘ఇంటింటికీ..’ ఫ్లాప్ : అసహనంలో చంద్రబాబు!

By:  Tupaki Desk   |   4 Oct 2017 11:00 PM IST
‘ఇంటింటికీ..’ ఫ్లాప్ : అసహనంలో చంద్రబాబు!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా ఉన్న రెండు రాజకీయ పార్టీలు దాదాపుగా ఒకే సమయంలో.. ప్రతి నియోజకవర్గంలోనూ ఇంటింటికీ తిరిగి తమ పార్టీల గురించి ప్రచారం చేసుకునే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్న వస్తున్నాడు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతి ఇంటికీ వెళుతోంది. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో తెదేపా ఇంచుమించుగా అదే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ప్రజల స్పందన.. .కార్యక్రమం సక్సెస్ విషయంలో ఇరు పార్టీలకు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. కార్యక్రమం గురించిన సమీక్ష సమావేశాల్లో చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్న శైలిని బట్టి, ఆయన ప్రదర్శిస్తున్న అసహనాన్ని బట్టి తెలుగుదేశం కార్యక్రమం ఫ్లాప్ అయినట్లే ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం.. తాము ముందుగా నిర్దేశించుకున్న గడువు అక్టోబరు 2 పూర్తయిపోయినప్పటికీ.. ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉండడంతో.. ఈ కార్యక్రమాన్ని మరికొంత కాలం పాటు పొడిగించి నిర్వహించాలని నిర్ణయించుకుంది.

అక్టోబరు 2 నాటికి వైకాపా కార్యక్రమం పూర్తయినట్టే. అయితే ప్రజలనుంచి స్పందన ఎక్కువగా ఉన్న కారణంగా మరికొన్నాళ్లపాటూ నియోజకవర్గం మొత్తం పూర్తయ్యే వరకు దీన్ని కొనసాగించాలని పార్టీ జనరల్ సెక్రటరీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జిలకు ఉత్తరాలు రాశారు. ఈ కార్యక్రమం ప్రభావంగా ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఇనుమడంచినట్లుగా కనిపిస్తోంది.

అదే సమయంలో చంద్రబాబు తీరు భిన్నంగా ఉంది. బుధవారం సమీక్షసమావేశం నిర్వహించిన ఆయన అనేక నియోజకవర్గాలకు చెందిన నాయకుల మీద అసహనం ప్రదర్శించారు. ఆగ్రహంతో దాదాపుగా చిందులు తొక్కారు. నియోజకవర్గాల ఇన్ ఛార్జిలుగా నాయకులనే మార్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని... ఆ నిర్ణయం తీసుకోడానికి వెనుకాడేది లేదని వారిని హెచ్చరించారు. అచ్చంగా చంద్రబాబు మాటల్ని గమనిస్తేనే ఈ కార్యక్రమం నిర్వహించడంలో.. అంటే ఇంటింటికీ రీచ్ కావడంలో తెలుగుదేశం ఫెయిలైనట్లుగా కనిపిస్తున్నదని పలువురు భావిస్తున్నారు. సాధారణంగా కార్యకర్తలు - నాయకుల మీదకంటె టెక్నాలజీ మీదనే ఆధారపడే చంద్రబాబు.. ఈ కార్యక్రమం నిర్వహణపై గ్రేడింగ్ చేశాం అని.. 20 సెగ్మెంట్లు సీ - డీ గ్రేడ్ లలో ఉన్నాయని.. ఆయా చోట్ల నాయకుల్ని మార్చేస్తామని హెచ్చరించారు. ఆయన మాటల్లోనే ప్రోగ్రం ఫెయిల్యూర్ తెలుస్తుండగా.. వాస్తవంలో... కార్యక్రమం విఫలమైన నియోజకవర్గాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నదనే సమాచారం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.