Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ పాత రీల్ వేసిన బాబు

By:  Tupaki Desk   |   4 March 2016 10:41 AM GMT
మ‌ళ్లీ పాత రీల్ వేసిన బాబు
X
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్కీంలో భాగంగా అభివృద్ధి పేరుతో ప్ర‌తిప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు సైకిలెక్కుతున్న‌ప్ప‌టికీ ఆ పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మ‌రో ర‌కంగా ఇబ్బందులు పాల‌వుతున్నారు. రాజ‌ధాని అమరావ‌తిలో భూ దందా జ‌ర‌గుతోంద‌ని వైసీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం , జ‌గ‌న్ మీడియాలో వ‌స్తున్న వ‌రుస క‌థ‌నాల‌ నేప‌థ్యంలో...సంద‌ర్భం ఏదైనా బాబు ఆ క‌థ‌నాల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా కోటప్పకోండకు వెళ్లిన చంద్ర‌బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకే తమపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్రజల బలహీనతలు సొమ్ము చేసుకోవడానికే వారు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి కోసం తాను ప్ర‌ణాళికబ‌ద్ధంగా అడుగులు వేస్తున్న విష‌యాన్ని ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని బాబు ధీమా వ్యక్తం చేశారు. కొందరు కులాల పేరుతో బయలుదేరుతున్నారని, తాను అధికారంలోకి వచ్చే వరకూ వీళ్లు ఏం చేశారని ప‌రోక్షంగా కాపు నాయకుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం - ఎంఆర్‌ పీఎస్ నాయ‌కుడు మంద‌కృష్ణ మాదిగ‌పై ఫైర్ అయ్యారు. అలాంటి వారి విష‌యంలో ప్రజల విజ్ఞతతో ఆలోచించాలని, వారి రెచ్చ‌గొట్టే రాజ‌కీయాల‌ను నమ్మిమోసపోవద్దని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో తాను చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్నానని చంద్ర‌బాబు గుర్తుచేసుకున్నారు. ఆ స‌మ‌యంలో త‌న‌కు కాలు నొప్పి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్రజల కష్టాలనూ తెలుసుకునేందుకు యాత్ర‌ను కొన‌సాగించాన‌ని ప్ర‌స్తావించారు.