Begin typing your search above and press return to search.

ఎంతమంది మీద కస్సుమంటారు చంద్ర బాబూ!?

By:  Tupaki Desk   |   24 Sept 2016 10:30 AM IST
ఎంతమంది మీద కస్సుమంటారు చంద్ర బాబూ!?
X
తమ అసమర్థతను బయటపెట్టే.. తాము జవాబు చెప్పలేని ప్రశ్నలు సంధిస్తే.. ఎవ్వరికైనా సరే కోపం ముంచుకొస్తుంది. అధికారంలో ఉన్న వారికైతే ఇక చెప్పనక్కర్లేదు. అసలే అధికారం - ఇక ముఖ్యమంత్రి స్థాయి అతి పెద్ద పదవి.. ఇక చంద్రబాబు లో ఈ అహంకారం ఎంత గొప్ప స్థాయిలో ఉంటుంది? అదే మరి. అందుకే ఆయన .. తన వద్ద సమాధానాలు లేని ప్రశ్నలు ఎవరు అడిగినా సరే వారి మీద కస్సు బుస్సు లాడుతున్నారు. ప్రెస్ మీట్ లలో ప్రత్యేక హోదా అనే పదాన్ని ఎవరైనా విలేకరి ప్రస్తావిస్తే చాలు.. మండిపడుతున్నారు. తాజాగా విశాఖలో కూడా అదే జరిగింది.

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం దారుణంగా విఫలం కావడం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి - ప్యాకేజీ అనే మాయపదార్థాన్ని తీసుకువచ్చారనేది ప్రజల భావన . కేంద్రం ద్వారా తెలుగు ప్రజలు దారుణమైన వంచనకు గురైన సమయంలో.. చంద్రబాబు తాను కూడా తన వంతు పాత్ర పోషించారే తప్ప రాష్ట్రానికి నాయకుడు లాగా వ్యవహరించలేకపోయారనేది ప్రజల మాటగా ఉంది. అయితే చంద్రబాబు మాత్రం ఇతర భాజపా - తెదేపా నాయకుల మాదిరిగానే.. హోదా ఎటూ రాదు.. ప్యాకేజీ చాలా గొప్పది అని జనాన్ని నమ్మించడానికి చూస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం చట్టబద్ధమైన హక్కుగా మన రాష్ట్రానికి హోదా కావాల్సిందేనంటూ ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.

వారి పోరాటం చంద్రబాబును అసహనానికి గురిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కనీసం ప్రెస్ మీట్ లో విలేకర్లు హోదా గురించి అడిగినా కూడా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రదారుల్లాగా భావిస్తూ నిప్పులు చెరగుతున్నారు. ప్రజలను నమ్మించడానికి మీడియా ఒక సాధనం అయితే.. తన వాదన ఏమిటో, ఏ రకంగా కరక్టో చంద్రబాబు తెలియజెప్పడానికి మీడియాను వాడుకోవాలి గానీ.. ప్రశ్నలడిగిన వారి మీద మండిపడితే ఏం వస్తుంది. తన ధోరణి మార్చుకుని తన వాదన నిజమైతే.. ఆ నమ్మకాన్ని చంద్రబాబు ప్రజల్లో కలిగించాలని పలువురు కోరుతున్నారు.