Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్నర్‌ పై బాబు శివాలు

By:  Tupaki Desk   |   17 Aug 2015 10:45 PM IST
గ‌వ‌ర్నర్‌ పై బాబు శివాలు
X
ఉమ్మ‌డి రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శివాలెత్తారు. కొద్దికాలంగా గ‌వ‌ర్న‌ర్ తీరుపై స్పందించ‌ని బాబు....విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ద్వ‌జ‌మెత్తారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో ప్రజల ఆస్తుల రక్షణ కోసమే విభజన చట్టంలో సెక్షన్-8 పొందుపరిచారని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌ దేనని సీఎం స్పష్టం చేశారు. కానీ ఆవిధంగా సీఎం వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని చంద్ర‌బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ఇదే క్ర‌మంలో రాష్ట్ర విభజన వలన తలెత్తిన సమస్యలను చంద్రబాబు వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఏకపక్షంగా రూపొందించిందని ఆరోపించారు. ఇటలీ రిపబ్లిక్‌ డే ను రాష్ర్ట‌ అపాయింటెడ్‌ డేగా ప్రకటించారని చంద్రబాబు దుయ్యబట్టారు. విభజన తీరు సరిగా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను కాంగ్రెస్ కావాలనే ఏపీలో విలీనం చేయలేదని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఆ మండలాలను ఏపీలో విలీనం చేశారని గుర్తుచేశారు.

విభజన సమయంలో ఆస్తులను ప్రాంతాల వారీగా, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారని అసంతృప్తి వ్యక్తం చేశారు.విభజన చట్టంలోని సెక్షన్-10లోని సంస్థలపైనా స్పష్టత లేకపోవడంతో ఆ సంస్థలన్నీ తమవేనని తెలంగాణ ప్రభుత్వం అంటోందని, దీంతో రాష్ట్ర పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఏపీకి చెందిన అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికాలేదని, ఈ కారణంగా ఏపీ స్థానికత కలిగిన 1250 మంది టి. విద్యుత్ ఉద్యోగులు రోడ్డు న పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సంబంధించిన సంస్థలన్నీ హైదరాబాద్‌ లోనే కేంద్రీకృతమవడంతో సాగు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణపైనా స్పష్టత లేదని, దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్‌ పై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌ లాంటి రాజధాని కావాలంటే రూ. 5 లక్షల కోట్లు కావాలని ఆనాడే చెప్పానని, కనీసం ఏపీ రాజధాని ఎక్కడ నిర్మించాలో కూడా చెప్పకుండా ప్రాంతాల మధ్య చిచ్చురేపేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. రాజధానిలో భవనాల నిర్మాణాలకు నిధులు ఇస్తామన్నారు.. కానీ, ఎంత ఇస్తారన్నది స్పష్టంగా చెప్పలేదని విమర్శించారు.