Begin typing your search above and press return to search.

చంద్రబాబును వణికించిన మోడీ ప్రకటన?

By:  Tupaki Desk   |   30 April 2019 12:16 PM IST
చంద్రబాబును వణికించిన మోడీ ప్రకటన?
X
ఫిరాయింపు రాజకీయాలు తమకూ తెలుసన్నట్టుగా మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పశ్చిమ బెంగాల్ లో మోడీ చేసిన ప్రకటన ఒకింత సంచలనంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలభై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని మోడీ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా నిలుస్తూ ఉంది. అంత మంది ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి బీజేపీ వైపు వస్తే మమతా బెనర్జీకి అంతకు మించిన ఝలక్ కూడా ఉండదు.

ఆమె సంగతలా ఉంటే.. మోడీ అలా ప్రకటించడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేసినట్టుగా తెలుస్తోంది. మోడీ చేసిన ఆ ప్రకటనలో బాబు ఒక్క సారిగా వణికిపోయారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. మోడీ తీరు చూస్తుంటే ఫిరాయింపు రాజకీయాలను కూడా చేపట్టేలా ఉన్నాడనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

ఇప్పటికే మోడీకి పెద్ద శత్రువై పోయాడు చంద్రబాబు నాయుడు. అందులో బాబు నాలుగున్నరేళ్ల పాటు బీజేపీతో సన్నిహితంగా ఉండి ఆ తర్వాత బయటకు వచ్చారు. అన్నింటికీ మోడీని నిందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో
బాబు మీద బీజేపీ ప్రత్యేకంగా దృష్టిపెట్టే అవకాశం ఉంది.

ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారానికి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోయినా.. కమలం పార్టీనే అధికారానికి దగ్గరగా నిలిచే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎంపీల ఫిరాయింపులను కూడా భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. మోడీ మాటలను బట్టి ఈ విషయం స్పష్టం అవుతూ ఉంది.

ఏపీలో చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ ఇదే రాజకీయమే చేశారు. బాబు ఎమ్మెల్యేలను ఫిరాయింపజేశారు. ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఉండే కొద్దో గొప్పో ఎంపీలను కూడా మోడీ తన వైపుకు లాగేసుకుంటాడేమో అనేది చంద్రబాబు నాయుడి టెన్షన్ గా మారిందని సమాచారం. ఆ టెన్షన్ తోనే చంద్రబాబు నాయుడు మోడీ ప్రకటన మీద టక్కున స్పందించేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ తీరుతో బాబు కు ఇప్పుడు మరింత టెన్షన్ పెరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.