Begin typing your search above and press return to search.

ఇంత ర‌ద్దీలో అంత మందితో ద‌ర్శ‌న‌మేంది బాబు?

By:  Tupaki Desk   |   15 Jan 2018 5:55 AM GMT
ఇంత ర‌ద్దీలో అంత మందితో ద‌ర్శ‌న‌మేంది బాబు?
X
సెల‌వులు వ‌చ్చినా.. ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో తెలుగు వారితో పాటు.. ప‌క్క‌నున్న క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడుతో పాటు.. దేశంలోని వివిధ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు చ‌టుక్కున గుర్తుకు వ‌చ్చేది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. రెండు.. మూడు రోజులు ప్ర‌శాంతంగా తీర్థ‌యాత్ర‌కు వెళ్లాలంటే ఫ‌స్ట్ ఆప్ష‌న్ తిరుమ‌లే గుర్తుకు వ‌స్తుంది.

తిరుమ‌ల‌కు వెళ్లాల‌న్న ప్లాన్ బాగానే ఉన్నా.. అక్క‌డ‌కు వెళ్లిన త‌ర్వాత నుంచే ఇబ్బందుల‌న్ని. గ‌దులు మొద‌లు ద‌ర్శ‌నం వ‌ర‌కూ అన్నింటికి ఇబ్బందే. సామాన్య ప్ర‌జ‌లకు ఇన్ని ఇబ్బందులు ఉంటే.. వీఐపీల వ్య‌వ‌హారం మ‌రోలా ఉంటుంది. మామూలు రోజుల్లో ఫ‌ర్లేదు కానీ.. వ‌రుస సెల‌వులు.. పండ‌గ‌లు.. ప్ర‌త్యేక రోజుల్లో వేలాది మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు పోటెత్తుతారు. ఇలాంటి వేళ ప్ర‌ముఖులు ఎవ‌రైనా స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని వ‌స్తే.. ఆ భారం సామాన్య భక్తుల మీద ప‌డుతుంది. ఒక అంచ‌నా ప్ర‌కారం ప్ర‌తి గంట‌కు త‌క్కువ‌లో త‌క్కువ 7 వేల నుంచి 10 వేల మ‌ధ్య‌లో భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకునే అవ‌కాశం ఉంటుంది.

ఇక‌.. ముఖ్య‌మంత్రి.. గ‌వ‌ర్న‌ర్‌..లాంటి ప్ర‌ముఖులు స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకోవ‌టానికి వ‌స్తే.. త‌క్కువ‌లో త‌క్కువ గంట నుంచి రెండు గంట‌ల పాటు ద‌ర్శనాన్ని నిలిపివేయ‌టం జ‌రుగుతుంది. అంటే.. ప్ర‌ముఖుల ద‌ర్శ‌నం కార‌ణంగా క‌నిష్ఠంగా ఏడు వేలు నుంచి గ‌రిష్ఠంగా ప‌న్నెండు వేల మంది ప్ర‌జ‌లు ప్ర‌భావితం అవుతార‌న్న మాట‌. అలాంటప్పుడు ర‌ద్దీ వేళ‌ల్లో వీవీఐపీలు చేసుకునే ద‌ర్శ‌నాలు సామాన్యుల‌కు సినిమా క‌ష్టాల్ని చూపిస్తుంది.

ఈ విష‌యాలు అధికారం చేతిలో ఉన్న వారికి అస్స‌లు గుర్తుండ‌వు. ఏపీ సీఎం చంద్ర‌బాబు లాంటి వారికి అస్స‌లు ప‌ట్ట‌దు. సంక్రాంతి పండ‌క్కి సొంతూరు నారావారి ప‌ల్లెకు వ‌చ్చిన ఆయ‌న‌.. ఆదివారం తిరుమ‌ల‌కు వ‌చ్చారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. పేరుకు ముఖ్య‌మంత్రి కుటుంబ‌మ‌ని చెప్పినా.. దాదాపు పాతికి మందికి పైనే బాబు వెంట ద‌ర్శ‌నం చేసుకోవ‌టానికి వ‌చ్చినోళ్లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. కొంద‌రైతే.. ఈ సంఖ్య మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు.

ఇంత మందికి చ‌క్క‌టి ద‌ర్శ‌నం చేయించ‌టానికి.. ముఖ్య‌మంత్రుల వారి మ‌న‌సు దోచుకోవ‌టానికి టీటీడీ శాయ‌శ‌క్తులా కృషి చేసింది. అయితే.. దీని ఫ‌లితం మాత్రం సామాన్య భక్తులకు త‌గిలింది. భ‌క్తుల రద్దీ ఎక్కువ‌గా ఉండ‌టం.. ముఖ్య‌మంత్రి వ‌ర్యులు స‌కులుంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకోవ‌టానికి రావ‌టంతో ద‌ర్శ‌నం క్యూల‌ను నిలిపివేశారు. దీంతో.. ర‌ద్దీ అంత‌కంత‌కూ పెరిగిపోయింది. ఆదివారం రాత్రి స‌మ‌యానికి భ‌క్తులు వెయిట్ చేసే కాంప్లెక్స్ ల‌న్నీ నిండిపోవ‌ట‌మే కాదు.. స్వామివారి ద‌ర్శ‌నం కోసం క్యూ లైన్లు దాదాపు రెండు కిలోమీట‌ర్ల మేర నిలిచిపోయాయి. ఇంత భారీగా భ‌క్తులు నిలిచిపోవ‌టానికి బాబు ఫ్యామిలీ శ్రీ‌వారి ద‌ర్శ‌నం కూడా అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదేమో. భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న వేళ‌.. స్వామివారి ద‌ర్శ‌నానికి రాకుండా ఉంటే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు భ‌క్తులు వ్య‌క్తం చేస్తున్నారు.