Begin typing your search above and press return to search.

ఎవ‌డు చెప్పాడ్రా..ఆంధ్రా నేత‌లు తెలివైనోళ్ల‌ని..!

By:  Tupaki Desk   |   13 Jan 2018 10:30 AM GMT
ఎవ‌డు చెప్పాడ్రా..ఆంధ్రా నేత‌లు తెలివైనోళ్ల‌ని..!
X
తెలుగు వారికి సంబంధించి ఏ చ‌ర్చ జ‌రిగినా.. ఆంధ్రా వాళ్లు మ‌హా తెలివైనోళ్లు.. వాళ్ల‌కున్న చురుకుద‌నం.. తెలివికి ఎవ‌రైనా స‌రే డంగై పోవాల్సిందేనంటూ చాలామాట‌లు చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం జ‌రిగిన వేళ‌లోనూ ఆంధ్రా ప్ర‌భుత్వం గురించి.. ఆంధ్రా నేత‌లు గురించి చాలానే చెప్పేవారు. ఆంధ్రా ప్రాంత నేత‌ల‌కు త‌మ ప్రాంతం త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌ద‌ని.. వారి దుర్మార్గం కార‌ణంగానే తెలంగాణ భారీగా న‌ష్ట‌పోయింద‌ని చెప్పేవారు.

వారి తెలివితేట‌ల‌తో తెలంగాణ వ‌న‌రుల్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నార‌న్న మండిపాటు వ్య‌క్త‌మ‌య్యేది. తెలంగాణ నేత‌లు.. ప్ర‌జ‌లు అమాయ‌కుల‌ని.. వారిని బుట్ట‌లో వేసుకొని తెలంగాణ‌కు భారీ న‌ష్టాన్ని క‌లుగ‌జేశార‌న్న మాట త‌ర‌చూ వినిపించేది.

నిజంగానే తెలంగాణ నేత‌లు.. ఉద్య‌మ‌వేత్త‌లు.. మేధావులు చెప్పిన‌ట్లుగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేత‌లు అంత తెలివైనోళ్లే అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు సాధ్య‌మ‌వుతుంద‌న్న ప్ర‌శ్న మాత్ర‌మే కాదు.. విభ‌జ‌న స‌మ‌యంలో తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని చూస్తూ అలా ఎలా ఉండిపోయార‌న్న మాట ఒక్క‌రి నోటి నుంచి కూడా రాని ప‌రిస్థితి.

విభ‌జ‌న జ‌రిగి దాదాపు నాలుగేళ్ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్న వేళ‌.. ఏపీకి జ‌రిగిన న‌ష్టం గురించి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏక‌రువు పెడుతున్న వైనం చూస్తే ఆశ్చ‌ర్యమ‌నిపించ‌క మాన‌దు. విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్రా.. తెలంగాణ రెండు త‌న క‌ళ్లుగా చెప్పిన ఆయ‌న‌.. ఒక కంటికి అన్యాయం జ‌రుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రాని ప‌రిస్థితి. అంతేనా.. ఏపీకి అన్యాయం చేసి.. తెలంగాణ‌కు వ‌రాల మీద వ‌రాలు ఇస్తుంటే.. విభ‌జ‌న ఫార్ములా ఏ మాత్రం బాగోలేద‌న్న మాట‌ను నోరు విప్పి చెప్ప‌ని చంద్ర‌బాబు.. ఇప్పుడు మాత్ర ఏపీకి ఎంత అన్యాయం జ‌రిగిందో తెలుసా? అంటూ లెక్క‌ల్ని తెర మీదకు తీసుకురావ‌టం గ‌మ‌నార్హం.

ఇప్పుడింత ఆవేద‌న‌తో లెక్క‌లు చెబుతున్న చంద్ర‌బాబుకు.. విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి తెలీదా? అంటే.. తెలుస‌నే చెప్పాలి. మ‌రి.. ఇప్ప‌టి మాదిరి అంత ఆవేద‌న‌తో ఆయ‌న ఎందుకు మాట్లాడ‌లేదంటే.. తెలంగాణ‌లో ఉన్న పార్టీ ప‌రిస్థితి ఏమ‌వుతుంద‌న్న సందేహంతో.. నోరు విప్ప‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ రోజున తెలంగాణ‌లో పార్టీ దాదాపుగా క‌నుమ‌రుగై పోయిన వేళ‌.. ఆయ‌న‌కు భ‌విష్య‌త్తులోనూ ప‌వ‌ర్ ఉంటే ఏపీలో మాత్ర‌మేన‌న్న విష‌యంపై పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న వ‌చ్చిన త‌ర్వాత మాత్ర‌మే ఆయ‌న నోటి నుంచి ఏపీకి జ‌రిగిన అన్యాయాలు గుర్తుకు వ‌స్తున్న పరిస్థితి.

ప్ర‌ధాన‌మంత్రి మోడీని క‌లిసి ఏపీని ఆదుకోవాలంటూ స‌మ‌స్య‌ల చిట్టాను అప్ప‌జెప్పిన బాబు మాట‌ల్ని ప్ర‌ధాని ఓపిగ్గా విన్నారే కానీ.. ఎలాంటి హామీ ఇచ్చింది లేదు. ఎప్ప‌టిలానే.. చూస్తాం.. చేస్తాం.. మీరు చెప్పిన విష‌యాల‌న్ని సీరియ‌స్ గా ప‌రిశీలిస్తామ‌న్న మాటే కానీ.. మ‌రింకేమీ చెప్ప‌లేదు.

ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టం ద్వారా.. ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకోవాల‌ని చూస్తున్న చంద్ర‌బాబు.. తాజాగా పే..ద్ద లిస్టును బ‌య‌ట‌కు తీశారు. విభ‌జ‌న కార‌ణంగా ఏపీ ఎంత‌గా న‌ష్ట‌పోయిందో చెప్పే ఈ లెక్క‌లు విన్న‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. ఆంధ్రా ప్రాంత నేత‌లు.. ఆంధ్రోళ్లు తెలివైనోళ్లు అన్న మాట అనేది ఎవ‌డ్రా అని అర‌వాల‌నిపించ‌కమాన‌దు. నిజంగా ఏపీ ప్ర‌జ‌లు.. వారిని ఏలే నేత‌ల‌కు నిజంగా తెలివి ఉంటే.. మ‌రింత దారుణంగా విభ‌జ‌న చేస్తుంటే ఒప్పుకునేవారా? ఒక‌వేళ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఓకే అన్నా.. ఇప్ప‌టి మాదిరి మౌనంగా ఉండేవారా? త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని గ‌ళం విప్పి పోరాడేవారుక‌దా? ఇంత‌కీ.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టం ఎలా జ‌రిగిందో చూస్తే..

1. 58% జనాభా ఉన్న రాష్ట్రానికి 46% ఆదాయాన్ని ఇచ్చారు.

2. ఆస్తులను స్థలం ప్రాతిపదికన పంచారు.

3. రుణాలను జనాభా ప్రకారం ఇచ్చారు.

4. విద్యుత్తును వినియోగం పద్ధతిలో పంచారు.

5. తిరిగి చెల్లించాల్సిన పన్ను బకాయిలను జనాభా ప్రాతిపదికన ఏపీకి 58.32%.. తెలంగాణకు 41.68% ఇచ్చారు.

6. స్థలం ప్రాతిపదికన పాత పన్ను బకాయిలను వసూలుచేసుకొనే వెసలుబాటు కల్పించారు. దీనివల్ల రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టం రూ.3,800 కోట్లు.

7. సింగరేణి బొగ్గు గనులను తొమ్మిదో షెడ్యూల్‌ లో పెట్టినప్పటికీ స్థలం ప్రాతిపదికన అందులో 51% వాటాను తెలంగాణకు ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దాని అనుబంధ సంస్థ ఏపీహెచ్‌ఎంఈఎల్‌కు మాత్రం అలాంటి నిబంధన పెట్ట‌లేదు.

8. అవశేష రాష్ట్రానికి రూ.1,30,000 కోట్ల భారీ రుణాన్ని బదిలీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంపై ఉన్న రుణంలో రూ.33వేల కోట్లను ఆంధ్రప్రదేశ్‌ పై అధికంగా మోపారు.

9. ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించాల్సిన పింఛను బకాయిలను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని నిబంధనతో ఏపీపై మరింత భారాన్ని మోపారు.