Begin typing your search above and press return to search.

బాబుకు ఏ కోరిక‌లు లేవు..అదొక్క‌టి త‌ప్ప‌!

By:  Tupaki Desk   |   5 July 2017 10:23 PM IST
బాబుకు ఏ కోరిక‌లు లేవు..అదొక్క‌టి త‌ప్ప‌!
X
తెలుగుదేశం పార్టీకి అభిమానం ఉండే జిల్లా అనంతపురం జిల్లా అని ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. అనంత‌పురం జిల్లాలోని ముక్తాపురంలోని రైతు కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ కు అత్యంత ఇష్టమైన జిల్లా అనంతపురం అని తెలిపారు. సమస్యల సుడిగుండం నుంచి జిల్లాను శాశ్వతంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. హుద్‌ హుద్ నుంచి విశాఖ కోలుకునేలా చేసి సుందరనగరంగా తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టిసీమ పూర్తిచేయకపోతే రాయలసీమకు నీరు వచ్చేది కాదని, పట్టిసీమపై చాలా విమర్శలు వచ్చినా వాటన్నింటినీ తిప్పికొట్టేలా చేసి చూపించామన్నారు. అలాగే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృష్ణాడెల్టాకు నీళ్లిచ్చి - రెయిన్‌ గన్ల ద్వారా నీళ్లిచ్చి పంటలు కాపాడామన్నారు.

వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చుకుని నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని రైతులకు చంద్ర‌బాబు నాయుడు ఈ సంద‌ర్భంగా సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు, అధికారులకు సీఎం చంద్ర‌బాబు సూచించారు. ``నాకంటూ ఏ కోరికలు లేవు…పేదవారిని ఆదుకోవాలనేదే నా లక్ష్యం” అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆగేది లేదని, ముందుకెళ్తూనే ఉంటానని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం అనంతపురంలో పండే పండ్లు, కూరగాయలు తినే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. నీరుంటే బంగారం పండించే రైతులు జిల్లాలో ఉన్నారని, పడే ప్రతి వర్షపు నీటి బొట్టును భూగర్భజలంగా మార్చుకోవాలని సీఎం చంద్ర‌బాబు నాయుడు రైతులకు తెలిపారు. రాష్ట్రంలో ఉండే అన్ని పరికరాలు తీసుకొచ్చి వేరుశెనగ పంట కాపాడేందుకు కృషి చేస్తానని అన్నారు.

తాను విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో పాదయాత్ర చేసేటప్పుడు రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకున్నానని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రైతు రుణ మాఫీ చేయాలని ఆనాడు నిర్ణయించినట్లే అమలు చేశానని సీఎం తెలిపారు. ఇప్పటి వరకూ రూ.24,500 కోట్ల రైతు రుణమాఫీ చేశామని, సన్న, చిన్నకారు రైతుల తేడాలేకుండా రుణమాఫీలు అమలు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. పెట్టుబడి రాయితీ కింద జిల్లాకు రూ.1,032 కోట్లు ఇచ్చామని సీఎం తెలిపారు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని పనిచేస్తున్నానని, ఇకపై పంటకుంటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు.