Begin typing your search above and press return to search.

బాబు బాధ త‌ర్వాత‌.. త‌మ్ముళ్ల‌కు చుక్క‌లేన‌ట‌!

By:  Tupaki Desk   |   7 Oct 2018 10:51 AM IST
బాబు బాధ త‌ర్వాత‌.. త‌మ్ముళ్ల‌కు చుక్క‌లేన‌ట‌!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్య‌వ‌హారం కాస్త సిత్రంగా ఉంటుంది. దేశంలో త‌న‌కు మించిన అనుభ‌వం ఉన్న సీఎం మ‌రొక‌రు లేర‌ని చెప్పే ఆయ‌న‌.. ఏదైనా అనుకోని ప‌రిస్థితి ఏర్ప‌డినా.. ఎవ‌రైనా ఘాటు విమ‌ర్శ‌లు చేసినా.. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి మొత్తం మారిపోతుంది. అప్ప‌టివ‌ర‌కూ త‌న‌కు మించినోడు లేర‌ని చెప్పే ఆయ‌న‌.. త‌న గొప్ప‌లు చాటుకోవ‌టానికి ద‌ర్బార్ త‌ర‌హాలో స‌మావేశాలు ఏర్పాటు చేసి.. గంట‌ల కొద్దీ టైంను నంజుకు తింటార‌ని చెబుతారు.

తాజాగా తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓ రేంజ్లో బాబును ఉద్దేశించి ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌టం తెలిసిందే. బండ‌కేసి బాదేసిన‌ట్లుగా వెనుకా ముందు చూసుకోకుండా..ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి అన్న‌ది ప‌ట్టించుకోకుండా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌టంపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్న వైనం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. పార్టీ నేత‌ల్ని చుట్టూ పెట్టుకొని స‌మావేశాన్ని నిర్వ‌హిస్తూ.. కేసీఆర్ తీరును త‌ప్పు ప‌డుతూ.. తాను ఎంత హుందాగా వ్య‌వ‌హ‌రించేది.. తాను ఎంత మ‌ర్యాద‌గా ఉండేద‌న్న విష‌యాన్ని అదే ప‌నిగా చెబుతూ.. త‌మ్ముళ్ల చెవుల్లో జోరీగ‌లా బాబు మాట‌లు మారుతున్నాయ‌ని చెబుతున్నారు.

తిట్టిన కేసీఆర్.. తిట్టించుకున్న బాబు సంగ‌త‌మో కానీ.. ఈ మొత్తం ఎపిసోడ్ త‌మ ప్రాణాల మీద‌కు తెస్తుంద‌న్న ఆవేద‌న‌ను తెలుగు త‌మ్ముళ్లు వ్య‌క్తం చేస్తున్నారు. తాను విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప‌డ్డా.. డిఫెన్స్ లో చిక్కుకున్నా.. వెంట‌నే పార్టీ నేత‌ల‌తో మీటింగ్ పెట్టేసి.. గంట‌ల త‌ర‌బ‌డి స‌మీక్ష‌ చేస్తున్న‌ట్లుగా చేయ‌టం.. అందులో పార్టీ నేత‌ల‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుండా.. బాబు ఒక్క‌రే గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడే వైనంతో త‌మ్ముళ్ల చెవుల నుంచి ర‌క్తాలు కారుతున్నాయంటూ గ‌గ్గోలు పెడుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నికల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌టం ద్వారా సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్న చంద్ర‌బాబు తీరును కేసీఆర్ ఘాటు ప‌ద‌జాలంతో తిట్టిపోస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌రెవ‌రూ తిట్ట‌లేనంత దారుణంగా బాబును కేసీఆర్ తిడుతున్నారు.

ఈ వ్య‌వ‌హారం బాబుకు ఇబ్బందిక‌రంగా మారింది. తొంద‌ర‌ప‌డి తన నోటి నుంచి ఒక్క మాట వ‌చ్చినా.. దాన్ని చిలువ‌లు వ‌లువ‌లు చేసిన త‌న మాట‌ల మాయాజాలంలో తెలంగాణ ప్ర‌జ‌ల భావోద్వేగాల్ని ర‌గిలేలా కేసీఆర్ చేసే స‌త్తా ఉంద‌న్న భ‌యం బాబులో చాలానే ఉంద‌ని చెబుతారు. అందుకే.. తొంద‌ర‌ప‌డి ఒక మాట అన‌టానికి బాబు జంకుతుంటార‌ని చెబుతారు.

తాజాగా త‌న పార్టీ నేత‌ల‌తో క‌లిసి స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించిన బాబు.. కేసీఆర్ వాడుతున్న బాష‌.. త‌న‌ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్య‌ల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్ర‌జ‌ల్ని ఓట్లు అడిగే ప‌రిస్థితి లేద‌ని.. అందుకే ఆంధ్రుల‌ను.. త‌న‌ను తిట్టి మ‌రోసారి తెలంగాణ ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల్ని రెచ్చ‌గొడితే త‌ప్ప గెల‌వ‌లేమ‌న్న అభిప్రాయంతో కేసీఆర్ ప‌ని చేస్తున్న భావ‌న క‌లుగుతుంద‌న్న మాటను బాబు చెప్పారు.

ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు మెద‌క్ జిల్లా రాజ‌కీయాల్లో క‌ర‌ణం రామ‌చంద్ర‌రావుకు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చేవార‌ని.. కేసీఆర్ ను అస్స‌లు ప‌ట్టించుకునే వార‌ని.. తాను మాత్రం కేసీఆర్‌కు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు తెచ్చాన‌ని.. త‌ర్వాత కేబినెట్‌లో అవ‌కాశాన్ని ఇచ్చిన‌ట్లు చెప్పారు.

త‌న కింద ప‌ని చేసినా కేసీఆర్ ను తాను ఎప్పుడూ అలా చూడ‌లేద‌ని.. సీఎం అయ్యాక కూడా ఆయ‌న‌కు ఇవ్వాల్సిన గౌర‌వాన్ని ఇస్తూనే వ‌చ్చాన‌ని చెప్పారు. ఆయ‌న్ను త‌న కొలీగ్ గానే చెప్పేవాడిని త‌ప్ప త‌క్కువ చేయ‌లేద‌ని.. కేసీఆర్ ఎలా మాట్లాడినా త‌న హుందాత‌నాన్ని కాపాడుకుంటూనే వ‌చ్చిన‌ట్లు చెప్పారు.కేసీఆర్ వాడుతున్న భాష‌ను ప్ర‌జ‌లు ఓటేస్తార‌ని తాను అనుకోవ‌టం లేద‌ని చెప్పుకొచ్చారు. బాబు బాధేమో కానీ.. గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని త‌న ఆవేద‌న‌ను.. త‌న గొప్ప‌ల్ని చెప్పుకోవ‌టానికి బాబు వినియోగిస్తున్న వైనం త‌మ్ముళ్ల‌కు చుక్కలు క‌నిపించేలా చేస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికైనా బాబు త‌న రొద ఆపి.. కేసీఆర్ ను ఎలా డీల్ చేయాల‌న్న విష‌యంపై ప్లాన్ చేసుకుంటే మంచిది.