Begin typing your search above and press return to search.

అప్పుడు పుష్కరాలు.. ఇప్పుడు శంకుస్థాపన

By:  Tupaki Desk   |   23 Oct 2015 11:02 AM IST
అప్పుడు పుష్కరాలు.. ఇప్పుడు శంకుస్థాపన
X
కష్టపడకుండానే పేరు ప్రఖ్యాతులు కొట్టేస్తుంటారు కొందరు. కానీ.. అదేం చిత్రమో ఏపీ ముఖ్యమంత్రి కిందామీదా కష్టపడినా కూడా పేరు ప్రఖ్యాతులు చివర్లో హ్యాండిస్తాయి. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చంద్రబాబు కానీ సీన్లోకి వస్తే.. పరిస్థితులు యుద్ధ ప్రాతిపదికన మారిపోతుంటాయి. ఈ విషయం హుధూద్ తుఫాను సందర్భంగా లక్షలాదిగా ఉండే విశాఖ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. చంద్రబాబులోని శ్రమించే తత్వం తమకు వరంగా మారిందని నాటి హూధూద్ గురించి ప్రస్తావన వస్తే చాలు వైజాగ్ ప్రజలు చెప్పేస్తుంటారు.

పని రాక్షసుడన్న పేరున్న చంద్రబాబు.. తనకున్న పేరుకు తగ్గట్లే విపరీతంగా శ్రమించటమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అలాంటి ఫలితాన్నేరాబడతారు. ఏపీ సర్కారు తనకు తానుగా సొంతంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించారంటే ఆ క్రెడిట్ మరో మాట లేకుండా చంద్రబాబుకే చెల్లుతుంది. నిద్రాహారాలు మాని.. అద్భుతంగా శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించాలన్న తపనకు తగ్గట్లే సక్సెస్ ఫుల్ గా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పూర్తి చేశారు.

గోదావరి మహా పుష్కరాల సందర్భంగా చోటు చేసుకున్న మహా తొక్కిసలాట.. భారీ ఎత్తున ప్రజలు దుర్మరణం పాలు అయిన నేపథ్యంలో.. శంకుస్థాపన కార్యక్రమానికి దాదాపు లక్షన్నర మంది హాజరైతే ఇబ్బందులు ఏర్పడతాయన్న సందేహాల్ని పటాపంచలు చేస్తూ.. కించిత్ కష్టం ఎదురుకాకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసిన క్రెడిట్ చంద్రబాబుదే. అయితే.. ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించి.. అమరావతి బ్రాండ్ ను ఘనంగా ఆవిష్కరించినప్పటికీ బాబుకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాకపోవటం తర్వాత సంగతి.. ఆయనపై విమర్శలు వర్షం కురుస్తున్న సంగతి.

గోదావరి మహా పుష్కరాల సందర్భంగా కూడా ఆయన అద్భుతరీతిలో ఏర్పాట్లు చేశారు. అయితే.. ఒక్క తొక్కిసలాట ఆయన పడిన కష్టాన్ని బూడిదలో కలిపేసింది. నిద్రాహారాలు మానేసి కష్టపడినా.. తొక్కిసలాటలో పెద్ద ఎత్తున దుర్మరణం పాలు కావటం ఆయనపై చెరపలేని మచ్చను పడేలా చేసింది. దీన్ని పోగొట్టుకునేందుకు బాబు ఎంతగా కృషి చేసినప్పటికీ తిరిగి తేలేని ప్రాణాల కారణంగా ఆయన కష్టం ఎవరి గుర్తింపునకు నోచుకోలేదు. తాజాగా అమరావతి శంకుస్థాపనకు అద్భుత రీతిలో ఏర్పాట్లు చేసినప్పటికీ.. ప్రధాని నోటి నుంచి ఏపీకి ఎలాంటి వరాన్ని ప్రకటించేలా చేయకపోవటం.. స్పెషల్ ప్యాకేజీపై మాట వరసకు కూడా వ్యాఖ్య చేయకపోవటం.. దానికి కారణం బాబు చేతకానితనమే అంటూ వైఫల్యం ఆయన ఖాతాలోకి ట్రాన్సఫర్ అయిన పరిస్థితి. తనవరకు తాను ఎంత కష్టపడినా.. క్రెడిట్ మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారని.. బాబును బ్యాడ్ లక్ వెంటాడుతుందని తెలుగు తమ్ముళ్లు విపరీతమైన వేదనను వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్ల వేదనలో నిజముంది కదూ.