Begin typing your search above and press return to search.

చంద్రబాబుది ప్రతాపమా..? ప్రగల్భమా?

By:  Tupaki Desk   |   3 April 2016 2:41 PM IST
చంద్రబాబుది ప్రతాపమా..? ప్రగల్భమా?
X
‘‘బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నామని వారు చెప్పినట్లల్లా వినాలంటే కుదరదు... మనమేమీ మన సొంతానికి నిధులడగడం లేదు కదా, రాష్ట్రం కోసమే అడుగుతున్నాం.. ఇక కేంద్రంతో తేల్చుకుందాం’’ .. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే, అదే సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారన్నదీ చర్చనీయాంశంగా మారుతోంది. చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కేంద్రం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే.. ఆయన అంత తీవ్ర వ్యాఖ్యలు చేసే సమయంలో బీజేపీకి చెందిన మంత్రులను మాత్రం బయటకు పంపించేశారట. అలా పంపిచేయడమే ఇప్పుడు చంద్రబాబుపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇంతకుముందెన్నడూ లేనట్లుగా చంద్రబాబు కేంద్రంపై తన స్వరం పెంచారు. కానీ... కేంద్రంతో ఎలా వ్యవహరించాలి.. ఎలా ఢీకొట్టాలన్న విషయంలో ఆయన మంత్రివర్గంలో మాట్లాడేటప్పుడు బీజేపీ మంత్రులను బయటకు పంపించేశారు. దీంతో వారి ముందు ధైర్యంగా అనలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. నిజానికి కేంద్రంపై స్వరం పెంచాలన్నా, ఒత్తిడి పెంచాలన్నా కూడా ఆ సమయంలో బీజేపీ మంత్రులు అక్కడ ఉంటేనే ఆ విషయం బీజేపీ అధిష్ఠానం వరకు వెళ్లేది. కానీ, చంద్రబాబు అలా చేయలేదు. వాళ్ల సమక్షంలో కేంద్రాన్ని ఏమైనా అంటే వారి నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో వారి పరోక్షంలో అలా మాట్లాడారని తెలుస్తోంది.

చంద్రబాబుకు నిజంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ధైర్యమే ఉంటే అలా నాలుగ్గోడల మధ్య కాకుండా ఓపెన్ గా అందరూ ఉన్నప్పుడే అనేవారని... అలా చేయలేదు కాబట్టి ఆయన ఒత్తిడి పెంచుతారని ఆశించడం కలేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.