Begin typing your search above and press return to search.

జైట్లీని బాబు గ‌ట్టిగానే అడిగేశార‌ట‌

By:  Tupaki Desk   |   24 Jan 2017 11:21 AM IST
జైట్లీని బాబు గ‌ట్టిగానే అడిగేశార‌ట‌
X
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసిన‌ట్లు తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి. సోమవారం సాయంత్రం నార్త్‌ బ్లాక్‌ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఈ మేర‌కు స్పెష‌ల్ స్టేట‌స్‌ కు చ‌ట్ట‌బ‌ద్ద‌త కోసం డిమాండ్ చేశారు. జైట్లీతో దాదాపు అరగంట సేపు జరిపిన చర్చల్లో చంద్రబాబు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన పలు హామీల అమలు గురించి కూడా చర్చించారని ఢిల్లీలోని టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.

డిజిటల్ చెల్లింపులకు జనామోదం పొందేందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు ఏర్పాటైన కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్లారు. మొదట సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ మాతృమూర్తి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌మ‌ణ‌ నివాసానికి వెళ్లి, ఆయనను పరామర్శించారు. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఈ సంతాప సమావేశానికి హాజరయ్యారు. ఆ తరువాత ఇద్దరు నేతలూ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన పలు హామీల అమలు గురించి కూడా చర్చించారని తెలిసింది. ‘ప్యాకేజీకి చట్టబద్ధత గురించి చర్చించాను. అయితే చర్చల వివరాలను ఇవాళ వెల్లడించలేను. మంగళవారం డిజిటల్ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం అన్ని విషయాలను వివరిస్తాను’ అని విలేక‌రుల‌తో చంద్ర‌బాబు చెప్పా రు.

ఇదిలాఉండ‌గా.. ప్ర‌ధాన‌మంత్రి సార‌థ్యంలో మంగళవారం మధ్యాహ్నం నీతి ఆయోగ్ కార్యాలయంలో జరిగే డిజిటల్ ఉపసంఘం సమావేశానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు హాజరవుతారు. ఆ తర్వాత ప్రధా ని మోడీతో భేటీ అవుతారని స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌త్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రితో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందని స‌మాచారం..

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/