Begin typing your search above and press return to search.
సీఎం హోదాలో మోడీని ప్రశ్నించావు..మరి దీని సంగతేంటి బాబు
By: Tupaki Desk | 28 March 2018 7:00 PM ISTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా మరోమారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పేరుకే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్ అయినప్పటికీ దాదాపుగా రాజకీయ అంశాలపైనే జరుగుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ - కొత్త బిల్లులు - ప్రజాసమస్యలపై జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ అంశాలే ప్రధానంగా చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం రాష్ర్టానికి ఎంతిచ్చింది...రాష్ర్టం ఆ నిధులను ఏం చేసింది. ఈ రెండు అంశాలపైనే తెలుగుదేశం, బీజేపీ సభ్యుల మధ్య చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు మరో ముందడుగు వేశారు. సాక్షాత్తు ప్రధాని మోడీ..ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదంటూ అసెంబ్లీలో ఎల్ఈడీ స్ర్కీన్ వేసి మరీ చంద్రబాబు చూపించారు.
కేంద్రం వైఖరికి నిరసనగా జపాన్ తరహాలో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి నల్లబ్యాడ్జీ ధరించి వచ్చారు.ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ విభజన చట్టాన్ని అమలు చేయమంటే.. కేంద్రం ఎదురుదాడి చేస్తోందని ఆయన విమర్శించారు. అమరావతి, తిరుపతి, నెల్లూరు సభల్లో మోడీ చేసిన వాగ్దానాలను మరోసారి తోటి ఎమ్మెల్యేలకు గుర్తుచేసే ప్రయత్నం చేశారు. విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును అసెంబ్లీ కేంద్రంగా చంద్రబాబు తప్పుబట్టారు. నాలుగేళ్ల క్రితం ఒక జాతీయ పార్టీ రోడ్డున పడేస్తే... మరో జాతీయ పార్టీ మోసం చేసిందన్న ఆవేదన ప్రజలు ఉందన్నారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సీఎం పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని కావాలనే ఇబ్బంది పెట్టే యోచనలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కేంద్రం అడిగిన విధంగా లెక్కలు చెప్పాలని అధికారులకు సూచించానన్నారు. అయితే... తప్పుడు యూసీలు ఇచ్చారంటున్న బీజేపీ నేతలను ఏమనాలి... అంటూ పేర్కొన్నారు.
ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య విషయమని, పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడొద్దని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో రుణమాఫీకి కేంద్రం సహకరించలేదని, యూపీలో కేంద్రం రుణమాఫీ చేయలేదా? అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా విభజన చట్టంలోని అన్ని అంశాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తామని చెప్పారని, ఈ విషయంలో ప్రజలకు విశ్వాసం కలిగించడానికే వచ్చానని మోడీ ఆనాడు ప్రకటించారని చంద్రబాబు అన్నారు. `ప్రధాని చెబితే జరుగుతుందని ప్రజలందరిలో ఆశ కలిగింది- కానీ ఇటీవల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు షాక్ కలిగిస్తోంది. మొత్తం 60 మందితో మాట్లాడిస్తే అందరూ ఆవేశం, ఆవేదనతో మాట్లాడారు. వీరిలో విభజన సమయంలో చాలామంది ఆందోళనలు, నిరసనలు చేశారు. మాట ఇచ్చిన వాళ్లే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి?- కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా తూట్లు పొడవడం ఎంత దుర్మార్గం?- జాతీయ పార్టీలు రెండింటికీ బాధ్యత ఉంది- ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చరో ఐదు కోట్ల మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్రానికి ఉంది- నేడు ప్రతి ఒక్కరూ కేంద్రం మీద పోరాడాలి- మామూలు వ్యక్తుల కన్నా రాజకీయ పార్టీలకు ఎక్కువ బాధ్యత ఉంది. వైసీపీ, బీజేపీ, జనసేన తప్ప అందరూ వచ్చారు. ఈ మూడు పార్టీలు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి- సమయం లేదా? లేక రాష్ట్రానికి న్యాయం చేయడం ఇష్టం లేదా?` అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం గుప్పించారు. యూసీలపై ప్రధానమంత్రి నరేంద్రమోడా సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
అయితే బాబు ఆవేదన, ఆగ్రహంపై పలువురు మరో రకంగా స్పందిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంలో వాస్తవం ఉందని అంగీకరిస్తూనే ఏపీకి జరిగిన అన్యాయం, అందులో చంద్రబాబు పాత్ర సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆగ్రహిస్తున్న చంద్రబాబు ఇన్నాళ్లపాటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యే కదా అని గుర్తుచేస్తున్నారు. పరిస్థితులు మారిన అనంతరం ఇప్పుడు అభివృద్ధి, ఏపీకి అన్యాయం అంటూ అనడం వల్లే ఆయనకు మద్దతు దక్కడం లేదని గుర్తు చేస్తున్నారు.
