Begin typing your search above and press return to search.

బాబు విగ్రహాల కోసం విరగబడుతున్నారు

By:  Tupaki Desk   |   28 Sept 2015 11:00 PM IST
బాబు విగ్రహాల కోసం విరగబడుతున్నారు
X
ఎంతో మంది ముఖ్యమంత్రులున్నా.. ఎవరికి దొరకని అవకాశం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కింది. విభజన కారణంగా ఆర్థికంగా అతలాకుతలమైన ఏపీని ఒక దరికి చేర్చి.. రాజధాని నగరాన్ని నిర్మించే అద్భుతమైన అవకాశం దక్కింది.

ఇదెంత అద్భుత అవకాశమో.. అంతే స్థాయిలో ప్రమాదకరం కూడా. ఏపీ రాజధాని నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోతే.. బాబు ఇమేజ్ ఆకాశానికి అంటటం ఖాయం. అదే సమయంలో ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం జరిగే పరిస్థితి. ఏపీ రాజధాని నిర్మాణం కోసం అహరహం కష్టపడుతున్న చంద్రబాబు ఇమేజ్ రాజధాని నిర్మాణంతో ఆకాశమంత ఎత్తుకు ఎదగటం ఖాయమంటున్నారు. రాజధాని నిర్మాణం సంగతి తర్వాత.. ఇప్పటికైతే.. రాజధాని శంకుస్థాపన కోసం చేపడుతున్న చర్యలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా.. మాట్లాడుకునేలా చేయాలన్న పట్టుదలతో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. రాజధాని నగరంగా ఎంపిక చేసిన కృష్ణా.. గుంటూరు జిల్లాల్లోని ప్రజానీకంలో బాబు మీద అభిమానం అమాంతం పెరిగిపోయిందని చెబుతున్నారు. తాము కలలో కూడా ఊహించని విధంగా తమ ప్రాంతాలు అభివృద్ధి చెందటంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావటం.. ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఇవ్వటంతో ఇప్పుడు బాబు నామస్మరణగా మారింది.

ఈ జిల్లాలకు చెందిన ప్రజలు.. తమ గ్రామాల్లో చంద్రబాబు విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన పలు గ్రామాల వారు చంద్రబాబు విగ్రహాల్ని ఏర్పాటు చేయాలని భావించి.. శిల్పులకు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇకేసారి పెద్ద సంఖ్యలో వస్తున్న చంద్రబాబు విగ్రహాలను ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రముఖ శిల్పులంతా చంద్రబాబు విగ్రహాల తయారీలో ఫుల్ బిజీగా అయిపోయిన పరిస్థితి. రాజధాని శంకుస్థాపన సమయానికి తమ గ్రామంలో చంద్రబాబు విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తమ్మీదా చంద్రబాబు విగ్రహాలకు విపరీతమైన డిమాండ్ ఉందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.