Begin typing your search above and press return to search.

వాళ్ల ఓట్లు టీడీపీకేనట.. చంద్రబాబు ధీమా!

By:  Tupaki Desk   |   2 May 2019 1:21 PM IST
వాళ్ల ఓట్లు టీడీపీకేనట.. చంద్రబాబు ధీమా!
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ వాళ్ల దగ్గర మరో విశ్లేషణ చేశారట. అది హైదరాబాద్ లోని సీమాంధ్రుల ఓట్ల గురించి. పోలింగ్ కు ముందు రోజున హైదరాబాద్ నుంచి ఓటర్లు భారీ ఎత్తున ఏపీకి తరలిన సంగతి తెలిసిందే. అలాంటి ఓట్లు అన్నీ తెలుగుదేశం పార్టీకే పడ్డాయని చంద్రబాబు నాయుడు విశ్లేషించారట!

హైదరాబాద్ లోని సీమాంధ్రులు తెలుగుదేశం పార్టీ అభిమానులే అని - వారు ఏపీలోని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీ ఎత్తున వచ్చారని.. తెలుగుదేశం పార్టీకే వాళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా పడ్డాయని చంద్రబాబు నాయుడు తమ పార్టీ వారి దగ్గర విశ్లేషించారట.

అలాంటి ఓటర్లు ఏపీకి రాకుండా ఉండటానికి కేసీఆర్ - జగన్ లు కుట్ర పన్నారని.. పోలింగ్ కు ముందు కేసీఆర్ హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు బస్సు సర్వీసులను రద్దు చేయించారని.. అదంతా కుట్ర అని బాబు అన్నారట. అయినా ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారని.. తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని బాబు విశ్లేషించారట.

మరి బాబు విశ్లేషణ ఎంత వరకూ నిజం అనేది మే ఇరవై మూడున తేలాల్సిందే. బాబు విశ్లేషణ సంగతలా ఉంటే.. విశ్లేషకులు మాత్రం మరో మాట చెబుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చిన మాట వాస్తవమే కానీ, అవన్నీ తెలుగుదేశం పార్టీ ఓట్లే అనుకోవడం ఒట్టి భ్రమ మాత్రమే అని వారు అంటున్నారు.

హైదరాబాద్ లోని సీమాంధ్రులకు తెలుగుదేశం పార్టీ మీద ప్రత్యేక అభిమానం లేదనే విషయం ఇది వరకటి ఎన్నికలతోనే తేలిపోయిందని పరిశీలకులు అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో అయినా, ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అయినా.. సీమాంధ్ర మూలాలున్న ప్రజలు గట్టిగా ఉండే ప్రాంతాల్లో తెలుగుదేశం నెగ్గలేదు.ఆఖరికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూకట్ పల్లి సీట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అలాంటి ఉదాహరణలు ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు తరలి వచ్చిన ఓటర్లంతా తెలుగుదేశం పార్టీకి ఓటేశారనుకోవడం భ్రమే అని వారు విశ్లేషిస్తున్నారు.

ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు వచ్చిన వారిలో - వారి సామాజిక - రాజకీయ ఆసక్తులను బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారూ ఉంటారు - జనసేన కోసం ఓటేయడానికి వచ్చిన వారూ ఉంటారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా ఆ ఓట్లన్నీ టీడీపీకే అనేది మాత్రం అంత బలమున్న వాదన ఏమీ కాదని అంటున్నారు.