Begin typing your search above and press return to search.

బాబు క‌మిట్ మెంట్ ఎంతో బాబు మాట‌లే చెప్పేశాయ్‌

By:  Tupaki Desk   |   9 March 2018 3:46 PM IST
బాబు క‌మిట్ మెంట్ ఎంతో బాబు మాట‌లే చెప్పేశాయ్‌
X
తాజాగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ త‌మ‌కెంత మోసం చేసిందో.. అంత‌కు మించిన మోసం చేసిన బీజేపీపై మండిప‌డుతున్నారు. ఏదో చేస్తార‌నుకున్న బాబు సైతం.. ప్ర‌జ‌ల మెప్పుకోసం.. ప్ర‌జ‌ల్లో ఉన్న మోడీ వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకోవాల‌న్న ఉద్దేశంతోనే మంత్రి వ‌ర్గంలో త‌మ మంత్రుల్ని ఉప‌సంహ‌రించుకున్నారే త‌ప్పించి.. ఎన్డీయేకు క‌టీఫ్ చెప్ప‌లేద‌ని గుర్తు చేస్తున్నారు.

ప్ర‌ధాని మోడీతో బాబు మాట్లాడిన ఫోన్ కాల్ లో కూడా ఏపీ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ బ‌లంగా ఉంద‌న్న మాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ బ‌లంగా ఉంది కాబ‌ట్టే హోదా కోసం బాబు పోరాడుతున్నారే త‌ప్పించి.. ఏపీకి జ‌ర‌గాల్సిన న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న మాట‌ను మోడీతో మాట్లాడిన ఫోన్ కాల్ సారాంశంగా ఆయ‌న‌కు అనుకూలంగా ఉండే ప్ర‌ముఖ మీడియా రాసిన వార్త‌లో ఉంది.

అంటే.. ప్ర‌జ‌లు కోపంగా ఉన్నారు కాబ‌ట్టే మంత్రుల్ని ఉప‌సంహ‌రించుకున్నామే త‌ప్పించి.. మీ మీద కోపం ఏమీ లేదు.. మీరేమీ చేయ‌కున్నా మాకు బాధ లేద‌న్న భావ‌న.. బాబు మాట‌ల్ని అదే ప‌నిగా చ‌దివితే అర్థం కాక మాన‌దు. బాబును హైలెట్ చేసేలా.. ఆయ‌న్నో వీరుడిగా.. శూరుడిగా చిత్రీక‌రించే ఆయ‌న అనుకూల మీడియా మోడీతో బాబు మాట్లాడిన ఫోన్ కాల్ సంభాష‌ణ ఇదేనంటూ ప్ర‌ముఖంగా ప్ర‌చురించింది. అందులో.. బాబు మాట‌ల్ని ఒక‌టికి రెండుసార్లు జాగ్ర‌త్త‌గా చ‌దివితే హోదా సాధ‌న‌పై బాబుకున్న క‌మిట్ మెంట్ ఏమిటో అర్థ‌మ‌వుతుంది.

ఏపీకి మోడీ స‌ర్కారు ఏమీ చేయ‌లేద‌న్న‌ది తెలిసిందే. ఆ విష‌యాన్ని బాబే చెప్పేస్తున్నారు. అలాంట‌ప్పుడు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు ఎందుకు రావ‌ట్లేదు? మ‌ంత్రుల్ని వెన‌క్కి పిలిపించుకున్న బాబు అదో ఘ‌న‌కార్యంగా చెప్పుకోవ‌టంలో మ‌త‌ల‌బు ఏమిటి? బాబు తీసుకున్న నిర్ణ‌యంతో ఇద్ద‌రు కేంద్ర‌మంత్రుల‌కు సంబంధించిన శాఖ‌లో అంతో ఇంతో ప‌నులు కూడా ఇక జ‌ర‌గ‌వు. ఒక‌వేళ ప్ర‌జ‌ల ఆకాంక్ష కోస‌మే పోరాడాల‌న్న‌దే ల‌క్ష్య‌మైతే.. అందుకు త‌గ్గ‌ట్లే మోడీ బ్యాచ్ తో క‌టీఫ్ నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకోన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌లు రాక మాన‌వు.

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాదానం ఒక్క‌టే.. అదేమంటే.. మోడీకి కోపం రాకూడ‌దు. అదే స‌మ‌యంలో ఏపీ కోసం ఏదో చేస్తున్నాన‌న్న బిల్డ‌ప్ ఏపీ ప్ర‌జ‌ల్లో క‌లిగించాల‌నే. ఏపీ చేసుకున్న దుర‌దృష్టం ఏమిటంటే.. ఆ రాష్ట్రం అభివృద్ధి కోసం నిజాయితీగా ప‌ని చేయ‌ని నేత చేతుల్లో రాష్ట్ర ప‌గ్గాలు ఉండ‌టం. ప్ర‌జ‌లు కోపంగా ఉన్నార‌న్న విష‌యాన్ని అర్థం చేసుకొని ఓటుబ్యాంకు రాజ‌కీయాల కోసం మంత్రుల్ని వెన‌క్కి పిలిపించుకోవ‌టం త‌ప్పించి.. హోదా సాధ‌న కోసం ఎంత మాత్రం కాద‌న్న‌ది స‌త్యం.