Begin typing your search above and press return to search.

మినిమం ఖర్చు మాత్రమే అంటున్న బాబు

By:  Tupaki Desk   |   11 Oct 2015 4:32 AM GMT
మినిమం ఖర్చు మాత్రమే అంటున్న బాబు
X
ఎప్పుడూ ప్రస్తావించని ఒక విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు. వివరణ ఇచ్చేలా ప్రయత్నిస్తున్నారు. పుట్టెడు కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్న రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తుండటం తెలిసిందే. ఇందుకోసం రూ.300 కోట్ల నుంచి రూ.400కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు అధికారులు.. నేతలు చెబుతున్నారు.

ఖర్చుకు సంబంధించిన లెక్కలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అదే సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఏ నెలకు ఆ నెల లెక్క చూసుకోవాల్సిన దుస్థితిలో ఏపీ ఉంటే.. అందుకు భిన్నంగా శంకుస్థాపన కోసం చేస్తున్న ఖర్చుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖర్చుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ముగిసిన గోదావరి పుష్కరాల కోసం దాదాపుగా రూ.1500కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పినా.. అంత ఖర్చు ఎక్కడా కనిపించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక శంకుస్థాపన కార్యక్రమానికి వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? అని సూటిగా ప్రశ్నించేవారున్నారు. ఇలాంటి మాటలు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందని గమనించిన చంద్రబాబు.. తన విధానానికి విరుద్ధంగా ఖర్చు గురించి వివరణ ఇచ్చేలా మాట్లాడటం గమనార్హం. వృధాగా ఖర్చు చేయటం లేదని.. అవసరానికి తగ్గట్లే ఖర్చు చేస్తున్నామని.. అనవసర ఖర్చులు చేయొద్దని తాను అధికారులకు చెప్పినట్లుగా వెల్లడించారు.

పని గురించి మాత్రమే మాట్లాడే చంద్రబాబు.. అందుకయ్యే ఖర్చు గురించి పెద్దగా ప్రస్తావించరు. అలాంటిది తన వైఖరికి భిన్నంగా బాబు.. ఖర్చుల గురించి పదే పదే ప్రస్తావించటంతో పాటు.. మొత్తం ఖర్చులో రెండు అంశాలే ప్రధానమని చెప్పుకొస్తూ.. రోడ్లు వేస్తున్నామని.. ఇది భవిష్యత్తులో అయినా వేసేదే కాబట్టి.. దాన్ని శంకుస్థాపన ఖర్చు కింద చూడటం సరికాదన్న వాదనను వినిపించారు.

ఇక.. రైతులకు నూతన వస్త్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. రైతులు చేసిన త్యాగానికి వెల కట్టలేమని.. వారు చేసిన దానితో పోలిస్తే.. వారికిచ్చే వస్త్రాల ఖర్చు అస్సలు లెక్కలోకి రాదని తేల్చేశారు. ఇలా రెండు అంశాల్ని ప్రస్తావించి.. వాటికి చేసేది అసలు ఖర్చు కాదని తేల్చేసిన చంద్రబాబు.. అతిధుల కోసం పెడుతున్న విమానాలు.. హెలికాఫ్టర్ల ఖర్చు.. స్టార్ హోటళ్ల కోసం పెట్టే ఖర్చు.. అతిధుల కోసం భారీగా తెప్పిస్తున్న బెంజ్.. ఆడి కార్లు లాంటి వాటి గురించి అస్సలు ప్రస్తావించకపోవటం గమనార్హం.

అదే సమయంలో.. శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీగా ఎందుకు చేయాల్సి వస్తుందన్న విషయాన్ని బాబు చెబుతూ.. తాను పెడుతున్న ఖర్చు తిరిగి వచ్చేదేన్నట్లుగా మాట్లాడటం విశేషం. శంకుస్థాపన కార్యక్రమంతో అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచటంతో పాటు.. అమరావతికి పెట్టుబడులు వచ్చేలా చేసేందుకు భారీగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఖర్చు గురించి ఇంతగా బాబు ప్రస్తావిస్తున్నారంటే.. ఖర్చు మీద చేస్తున్నవిమర్శల సెగ బాబు మీద పడినట్లుగా కనిపిస్తోంది.