Begin typing your search above and press return to search.

హఠాత్తుగా కొత్తపాటందుకున్న చంద్రబాబు!

By:  Tupaki Desk   |   6 April 2018 11:44 AM IST
హఠాత్తుగా కొత్తపాటందుకున్న చంద్రబాబు!
X
నిన్నటిదాకా మాట్లాడిన మాటలు.. హోదా సాధించడానికి పోరాడి తీరుతానన్న ప్రతిజ్ఞలు అన్నీ ఇప్పుడు వెనక్కుపోయాయి. రెండు రోజులు ఢిల్లీలో తిరిగి మోడీ మీద నిందలు వేసేలోగా.. చంద్రబాబునాయుడులో పోరాట పటిమ తగ్గిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్రానికి ప్రత్యేకహోదాను పోరాడి సాధించుకుంటాం అని చెబుతూ వచ్చిన నాయకుడు.. హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి.. సంయుక్త సభా కమిటీ వేస్తే చాలునని మాట్లాడడం... ఆయన కేంద్రంతో ఎక్కదో రహస్యంగా లాలూచీ పడడానికి నిదర్శనమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మోడీ సర్కారుతో సున్నం పెట్టుకోవడం వల్ల.. అసలే తన మీద పెండింగులో ఉన్న కేసులన్నిటినీ తిరగతోడుతారేమో అనే ఆందోళనలో బిక్కుబిక్కుమంటున్న చంద్రబాబునాయుడు.. కేంద్రంలోని కొందరి సూచనల మేరకే.. అతీగతీ లేకుండా మిగిలిపోయే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు గురించి కొత్తగా డిమాండ్ ప్రారంభించారనే వాదన కూడా వినిపిస్తోంది.

బడ్జెట్ కేటాయింపుల్లో తేడా వచ్చిన నాటినుంచి చంద్రబాబునాయుడు కేంద్రం పట్ల తేడాగానే మాట్లాడుతున్నారు. మధ్యలో ప్యాకేజీని వదిలేసి - ప్రత్యేకహోదా డిమాండ్ ను నెత్తికెత్తుకున్నారు.. తర్వాత అవిశ్వాసం అనే వైకాపా ఐడియాను కూడా కాపీ కొట్టి తాను ముందుగా ప్రతిపాదించారు. చివరికి న్యాయపోరాటాన్ని ఆశ్రయిస్తానని కూడా పలుమార్లు ప్రకటించారు. ఈ అన్ని రకాల పోరాట విధానాలు కూడా కేంద్రానికి చికాకు కలిగించేవే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ... జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే.. కేంద్రానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కమిటీ వేసి చేతులు దులుపుకుంటారు. అది ఎప్పటికి నివేదిక ఇస్తుందో తెలియదు. నివేదిక ఇస్తే.. ఖచ్చితంగా పాటించాలనే నిబంధన ఏం లేదు. ఆ రకంగా చంద్రబాబు కేంద్రాన్ని సుఖపెట్టదలచుకున్నట్టుగా ఉంది.