Begin typing your search above and press return to search.

నాన్ స్టాప్ స్పీచ్‌ తో ఇబ్బందే బాబూ!

By:  Tupaki Desk   |   11 Aug 2017 5:30 PM GMT
నాన్ స్టాప్ స్పీచ్‌ తో ఇబ్బందే బాబూ!
X
టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు మైకందుకున్నారంటే... వినేవాళ్ల‌కు విసుగు రావాల్సిందే గానీ... బాబుకు మాత్రం విసుగు అన్న మాటే క‌నిపించ‌దు. అవత‌లి వాళ్ల ఇబ్బందితో ఏమాత్రం సంబంధం లేకుండా నాన్ స్టాప్‌ గా మాట్లాడే బాబు... ఒక్కోసారి త‌న ప్ర‌సంగం వింటున్న అధికారుల‌తో పాటు ప్ర‌జ‌ల‌కు కూడా ఇబ్బంది క‌లిగించిన మాట మ‌నం చాలా సార్లే విన్నాం. వ‌య‌సులో ఉండ‌గా... ఈ త‌ర‌హా వ్య‌వ‌హారం బాగానే ఉంటుంది గానీ... వ‌య‌సు మీరుతున్న త‌రుణంలో ఇంకా నాన్ స్టాప్ స్పీచుల వెంటే ప‌డితే మాత్రం ఇబ్బంది ప‌డ‌క త‌ప్ప‌ద‌న్న విష‌యం ఇప్పుడు బాబుకు బాగానే అర్థ‌మైన‌ట్లుగా క‌నిపిస్తోంది. అయినా అస‌లు విష‌యం చెప్ప‌కుండా... ఈ ఉపోద్ఘాతాలెందుకంటారా? అయితే అస‌లు విష‌యంలోకి వ‌చ్చేద్దాం.

సుదీర్ఘ ప్ర‌సంగాల‌కు కేరాఫ్ అడ్రెస్‌ గా నిలుస్తున్న చంద్ర‌బాబు... నిన్న ఆ ప్ర‌సంగాల వ‌ల్ల క‌లిగే ఇబ్బందిని నిన్న ప్ర‌త్య‌క్షంగా చ‌వి చూశారు. న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో నిన్న మెడిసిటీ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో చంద్ర‌బాబు సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. స‌మావేశంలో త‌న వంతు వ‌చ్చిన త‌ర్వాత మైకందుకున్న చంద్ర‌బాబు... అమ‌రావ‌తిలో ఏఏం చేయాల‌నుకుంటున్నామ‌న్న విష‌యాన్ని అక్క‌డికి వ‌చ్చిన పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పాటు అధికార యంత్రాంగానికి అర్థ‌మ‌య్యేలా వివ‌రించే క్ర‌మంలో ఆయ‌న సుదీర్ఘ ప్ర‌సంగ‌మే చేశారు. అమ‌రావ‌తిని హెల్త్ సిటీగా మారుస్తామంటూ చెప్పిన చంద్ర‌బాబు... అందులో భాగంగా త‌మ ప్ర‌భుత్వం తీసుకోబోయే చ‌ర్య‌ల‌ను ఊటంకించారు. ఇలా ఓ 20 నిమిషాలు మాట్లాడారో - లేదో చంద్ర‌బాబు అస‌లు నిల్చోలేక‌పోయార‌ట‌. అయితే విష‌యాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించేందుకు ఇష్ట‌ప‌డ‌ని చంద్రబాబు... సైలెంట్ గా త‌న ప్ర‌సంగానికి కాస్తంత విరామం ఇచ్చేసి కూర్చుండిపోయారు.

ప్ర‌సంగాన్ని మ‌ధ్య‌లోనే ఆపేసి.... ఏమీ చెప్ప‌కుండా చంద్ర‌బాబు కూర్చోవ‌డంతో అక్కడి అధికారుల‌తో పాటు పారిశ్రామిక‌వేత్త‌లు కూడా ఆందోళ‌న‌కు గుర‌య్యార‌ట‌. అయితే ఈలోగా ఏమైంద‌న్న విష‌యాన్ని ఆరా తీసిన బాబు సెక్యూరిటీ... ఇబ్బంది ప‌డాల్సిన ప‌నేమీ లేద‌ని - నీర‌సం వ‌చ్చిన కార‌ణంగానే చంద్ర‌బాబు కూర్చుండిపోయార‌ని అక్క‌డి వారికి చెప్పార‌ట‌. నాన్ స్టాప్ ప్ర‌సంగాల్లో దిట్ట‌గా పేరుగాంచిన చంద్రబాబుకు నీర‌సం వ‌చ్చింద‌న్న విష‌యం అక్క‌డి వారిని నిజంగానే ఆందోళ‌న‌కు గురి చేసింద‌నే చెప్పాలి. ఈలోగా కాసేపు రెస్ట్ తీసుకున్న చంద్ర‌బాబు మ‌ళ్లీ మైకందుకుని ప్ర‌సంగాన్ని కొన‌సాగించార‌ట‌. అయితే ఈ ద‌ఫా త‌న ప‌రిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు కాసేప‌ట్లోనే త‌న ప్ర‌సంగాన్ని ముగించేశార‌ట‌. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి బ‌య‌లుదేరిన చంద్ర‌బాబు త‌న నివాసంలో రెస్ట్ తీసుకున్న‌ట్లుగా స‌మాచారం.