Begin typing your search above and press return to search.

జగన్ దగ్గరకు వెళ్లి మరీ బాబు బర్త్ డే విషెస్

By:  Tupaki Desk   |   21 Dec 2015 11:40 AM IST
జగన్ దగ్గరకు వెళ్లి మరీ బాబు బర్త్ డే విషెస్
X
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా తాజాగా ఏపీ అసెంబ్లీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ కోణంలో ఎవరి ఎజెండాను వారు అమలు చేయటం మామూలే అయినా.. ఇదంతా వ్యక్తిగత స్థాయికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ అసెంబ్లీలో పరిస్థితి అంతవరకూ వెళ్లలేదన్న విషయం తాజాగా నిరూపితమైంది. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని బర్త్ డే విషెస్ చెప్పటం ఆసక్తికరంగా మారింది.

ఈ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ అధికార.. విపక్ష సభ్యలు మధ్య ఏ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతుందన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో.. అధికార, విపక్షాల మధ్య మాటల దాడి మామూలే అయినా.. వెనుకాముందు చూసుకోకుండా ఎంతమాట పడితే అంత మాటలు అనేయటం.. ముఖ్యమంత్రి కూర్చున్న సీటు దగ్గరకు విపక్ష ఎమ్మెల్యేలు ఓ ఇరవై మంది దూసుకురావటం లాంటి ఘటనలు ఈ సమావేశాల్లో చోటు చేసుకున్నాయి.

దీంతో పాటు.. విపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాది పాటు సస్పెన్షన్ వేసింది కూడా ఈ సమావేశాల్లోనే. ఇంత హాట్.. హాట్ గా సమావేశాలు జరుగుతున్నప్పటికీ.. విపక్ష నేత జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని.. సోమవారం జగన్ సభలోకి అడుగు పెట్టిన వెంటనే.. ఆయన సీటు వద్దకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. జగన్ కు ఆత్మీయంగా చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆయన నవ్వుతూ కరచాలనం చేశారు. చంద్రబాబు వెంట.. మంత్రులు అచ్చెన్నాయుడు తదితరులు జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ దృశ్యం పలువురిని ఆకర్షించింది.